ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఎక్సెల్లంట్ పర్సనల్ బుక్ లైబ్రెరి

Posted by netizen నెటిజన్ on Friday, September 21, 2007
ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. ఒకరికి పప్పు, నెయ్యి ఆవకాయ ఐతే, ఇంకొకరికి రొయ్య పప్పు కూర అంటే ఇష్టం. ఒకస్త్రీకి వండి పెట్టడం ఇష్టం, మరొకామేకు పిల్లలతో గడపడం ఇష్టం. ఒకరికి కవిత్వం ఇష్టం. మరొకరికి కధలిష్టం.

పుస్తకాలంటే ఇష్టం ఉన్నవారికి పుస్తకాలగురించి మాట్లాడుకోవడం ఇష్టం. వాటిని కొనుక్కుని చదువుకోవడం ఇష్టం. ఇంకొకరితో చదివించడం ఇంకా ఇష్టం.

కొంతమంది పుస్తకాలు కూడా కొంటారు. చదివి అవతల పారేస్తారు. కొంతమంది పుస్తకాలు కొంటారు. అందంగా కనపడాలని, దళసరి ప్లాస్టిక్ కాగితంతో వాటికి చక్కగా అట్టలేస్తారు. ఇంకా అందమైన పుస్తకాలని అందమైన అద్దాల తలుపులున్న అరల్లొ బిగిస్తారు. అవి చూడ డానికి మాత్రమే. చదవడానికి కాదు. మీరు, నేను చదవడానికి కానే కాదు. పదిమందికి తన సాహిత్య "కలాపోసన" సూపించడానికే సుమా!ఆ పుస్తకాలంటుకుంటే మీరందరు మైలడిపొతారు.ఇది సాధారణంగా బాగా డబ్బుతో మదించినవారి లక్షణం.

పుస్తకాలను చదువుకోవడానికి మాత్రమే కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పుస్తకాలు, కొని చదివి ఊరుకోరు. ఆ పుస్తాకాలని చదివి అనందిస్తారనుకునే వాళ్ళకి అవి పంపుతారు. ప్రముఖ రచయిత దాట్ల వెంకట నరసరాజు గారి లాగ. పుస్తకాలు అచ్చేసేది చదవడాని కే కదా. చదవండి. చదివిన తరువాత నాకు పంపండి. మళ్ళీ మనబోటి వారికి అది చదవడానికి ఇవ్వచ్చు కదా అని అంటారు.

ఇంకా కొంత మంది ఉంటారు. వాళ్ళు వారికిష్టమైన విషయం మీదే పుస్తకాలని సేకరిస్తారు. కొంగర జగ్గయ్య. ఆయన దగ్గిర కొన్ని వందల రామాయణాలు ఉండేవి. అలాగే "జెమ్మాలజి" మీద కూడ.

కారా మాస్టారున్నారు. (కాళీపట్నం రామారావు గారు). వారికి కధలంటే ఇష్టం. అందుకని ఎక్కడెక్కడవో కధలు సేకరించారు. వాటిని పదిమందికి అందుబాటులోకి తెచ్చారు.


పుస్తకాల ఖరీదు?
విశాలంధ్ర వారనుకుంటాను వారి పుస్తకాలజాబితాలో వీరేశలింగంగారి మాటని ప్రచురించారు. ఆ వాక్యం గుర్తు లేదు గాని, దాని అర్ధం ఇది - "చిరిగిన బట్టయిన వేసుకొ, ఫరవాలేదు - కాని ఒక పుస్తకం కొనుక్కో".

పుస్తకాలు డబ్బున్నవారేవరైనా కొనుక్కోవచ్చు. కాని వాటిని పోషిండం చాలా కష్టం. పోషించడం అంటే అర్ధం ఆ పుస్తకాల జాబితా పెరుగుతు ఉంటుంది. మొదట్లో ఒక అరలో ఇమిడిపోతాయి. ఇక రెండో అర మొదలవుతుంది. మళ్ళి ఇంకొక అర కావల్సివస్తుంది. అది నిండిపోతుంది. అప్పుడు పక్కనే ఉన్న బల్ల మీద పడేస్తాము. తరువాతా నెమ్మదిగా పక్కల మీదకి జేరుతాయి. ఇక కొందరి ఇళ్ళల్లో ఐతే స్నానాలగదిలోకి కూడా చేరుతాయి.

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. స్థలం. ఒక గజం భాగ్యనగరం చుట్టుపక్కల ఐతే సుమారుగా మూడు వేలు పలుకుతోందట. పుస్తకాల అలమరా సుమారుగా ఒక ఐదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగులు వెడల్పు, ఒక అడుగున్నర లోతు ఉండాలి కదా? మరి ఆ లెఖ్ఖన ఎన్ని చదరపు అడుగులైంది? మరి మీ అలమర కి ఎంత స్థలం కావాలో ఆలోచించుకోండి. మరి అలమరకి, స్థలం కోసం ఎంత వెచ్చిస్తున్నారు?

అలాగే మీ అలమారాని దేనితో చేయించుకుందాం అని అనుకుంటున్నారు?
చెక్క? ఐతే మరి ఏ చెక్క? అడుగు ధర ఎంత?మరి దానికి గాజు బిగిస్తారుకదా? అది ఎంత మందాన ఉందాలి? దానికెంత? వడ్రంగి కూలి ఎంత? ఇవన్ని లెక్కేసుకుంటు పోతే మీకు పుస్తకాలకి ఎంత "కరుసవుద్దో" తెలుస్తుంది. ఇదెక్కడి గోలా ఈ బ్లాగరు ఇలా అంటారేమిటి అని? పుస్తకాలు కొనుక్కొవద్దా?

లేదు. మిమ్మల్ని పుస్తకాలు కొనవద్దనడంలేదు. కొనుక్కోండి. బెకన్ మహశయుడన్నట్టు, "కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్ని మింగాలి, మరి కొన్ని తిని జీర్ణం చేసుకోవాలి".

కాబట్టి ముందే, అవి ఎమిటి అన్నవి నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యంతో పుస్తకాలని సేకరిస్తే కొంత కాలానికి బ్రహ్మాండమైన స్వంత పుస్తకభాండాగారం ఏర్పడుతుంది.

లేకపొతే అవన్నీ కూడా చివరికి వీధి మూలమీదున్న చెత్తకాగితాల దుకాణం వాడికి చేరుతాయి. ఇక అంతే సంగతులు. ఇంకో అవకాశం కూడా ఉంది. మనకి పుస్తకాలమీద ఉన్న నిర్లక్షాన్ని ఇంట్లొ వాళ్ళు పసిగట్టారో ఇంక అంతే సంగతులు. వాళ్ళు కూడా ఒకొక్క పుస్తకాన్ని నెమ్మదిగా అవసరాన్ని బట్టి వాడికి చేరవేస్తారు.

కాబట్టి ఇందాక అనుకున్నట్టు ముందే మనకి ఇష్టమైన విషయం ఏమిటి అన్నది నిర్ణయించుకుని వాటిమీదే దృష్టి పెట్టుకుంటే బావుంటుంది.

ఎలాంటి పుస్తకాలు కొనాలి?
ఈ రోజు నాకు కధలంటే ఇష్టం. అక్కడెక్కడోఒక కవిత చదివాను. అది బాగుంది. మరి ఆ పుస్తకం కొనొద్దా? కొనుక్కోండీ. కాని కొనబొయేముందు ఆ పుస్తకాన్నిఎందుకు కొనాలనుకుంటున్నామో ఒకసారి మళ్ళీ ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే అదొక కవితా సంకలనం అనుకుందాం. అప్పుడు అందులో ఏ కవిత మీకు నచ్చిందో చూసుకోవాలి. ఆ కవి ఇతర కవితలు కూడా చూడాలి. అవి కూడా బాగుంటే అప్పుడు ఏంచెయ్యాలి? అదే మీ నిర్ణయం. కవిత్వమా? కధలా? నవలలా? కవితా సంకలనాలా? కధా సంకలనాలా? ఒకే రచయిత్రివా? వివిధ రచయిత్రులవా? ఒక తరానివా?

లేదండి. ఏదైనా బాగున్న పుస్తకం ఐతె నేను కొనుక్కుంటాను. బాగున్న పుస్తకం , బాగలేదన్న పుస్తకం అని ఉండవు. బాగా రాసిన పుస్తకం బాగ వ్రాయని పుస్తకాలే ఉంటాయి అని ఒక పెద్ద మనిషి అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకొండి.

మరి కొనొక్కొవడా నికి డబ్బులు కావాలికదా? ఉన్నవి కదా? లేవు. పండగలకి చీరలకి, జాకెట్లకి, దాచుకున్నట్టే పుస్తకాలకి కూడా "ఇంత" అని కేటాయించాలి. ఆలా ఐతే మీకు కావలిసినవే కొనుక్కోగలుగుతారు. లేక పొతే అడ్డమైన చెత్త కొనాల్సి వస్తుంది.మీరు ఉద్యోగస్తులైతే నెలకి ఇంత అని కేటాయించుకోండి. అందు లో ఏమేమి పుస్తకాలు కొనాలో చూసుకోండి. అందులోనే సరిపుచ్చుకోండి.

పుస్తకాలు సేకరించడం ఎలా?
మరి సరిపుచ్చుకోవాలంటే ఏమేమి కొనాలో తెలియాలి కదా? అవును. అందులో భాగంగా యాహూ , గూగుల్ లాంటి వాటిల్లొ ఉండే సాహిత్యానికి సంభందించిన గుంపుల్లొ చేరండి. అలాగే సాహిత్యాభిమానులతో పరిచయాలు పెంచుకోండి. దానివల్ల కొత్త పుస్తకాలగురించే కాకుండా, మీకు కొత్త ఐన కొన్ని "పాత పుస్తకాల"గురించి కూడా తెలుస్తుంది. మీరున్న ఊళ్ళో సాహిత్య సభలు జరుగుతుంతే వాటికెళ్ళండి. అలాంటివి లేక పోతే మీరే మొదలుపెట్టండి. పది మంది పది రూపాయలేసుకుంటే నెలకి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.

మీ ఊళ్ళో ఉన్న పుస్తకాల కొట్లో మీ చిరునామా ఇవ్వండి. కొత్త పుస్తకాలు, సాహితి సమావేశలు ఉన్నప్పుడు తెలియజేయమనండి.

కొన్ని పెద్ద దుకాణాలకు ప్రాంతీయ శాఖలుంటాయి. ఉదాహరణకు, విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి సంస్థలు. ఈ సంస్ఠలు కొత్త పుస్తకాలు విడుదలైనప్పుడుకాని, నెలకొకసారనో వాళ్ళ ప్రచురణలతో బాటు , ఒక పుస్తకం రూపంలో కొత్త విడుదలల గురించి తెలియజేస్తుంటారు. అందులో సభ్యులుగామిమ్మల్ని చేర్చుకోమని కోరితే వాళ్ళు చేర్చుకుంటారు.

"విశాలాంధ్ర" కి ఒక పధకం ఉంది. దాని ప్రకారం ఒక పాతిక రూపాయలు వారికి కడితే దానిని వారు రెండు సంవత్సరాల సభ్యత్వ రుసుము కింద తీసుకుని మిమ్మల్ని వారి "పుస్తక ప్రియుల సమూహం" లో( Book Readers Club)లో చేర్చుకుంటారు. సభ్యులకి తమ ప్రచురణల మీద ఇరవై శాతం, వారు అమ్మే ఇతరుల పుస్తకాల మీద పది శాతం తగ్గింపు ఇస్తారు. వారు జరిపే పుస్తక ప్రదర్శనలకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు.

మీ అభిరుచికి తగ్గ పుస్తకాలని ప్రచురించే సంస్థలకు మీ చిరునామతో ఉత్తరం వ్రాస్తే, వారు కూడా మీకు తమ దగ్గిరున్న పుస్తకాల గురించి తెలియజేస్తుంటారు.

వీటాన్నింటిని దగ్గిరపెట్టుకుంటే మీకు కావలిసిన పుస్తకాలన్ని అందుబాట్లో ఉన్నట్టే.

పుస్తక ప్రదర్శనలు
ప్రతి సంవత్స రం, ఈ పుస్తకాల వాళ్ళందరు ఒక చోట చేరి పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేసుకుంటారు. సాధారణంగా ఇలాంటి ప్రదర్శనలకి సుమారుగా నూట యాభై నుండి రెండు వందలదాకా, ప్రచురణకర్తలు, విక్రేతలు తమ పుస్తకాలని తెస్తారు. అక్కడ మనం ఐపోతాము. చీరలకొట్లొ ఎటు చూసిన చీరలే? అన్ని కావాలి. డబ్బులు చూసుకోవాలి. మరి మన దగ్గిర అవి లేవుగా. అందుకని ఇందాకా అనుకునట్టు ఈ వార్షిక ప్రదర్శనలకి కూడా ప్రణాళిక బద్ధంగా కొంత సొమ్ముని పక్కన పెట్టుకోవాలి.

ఇక ఈ పుస్తక ప్రదర్శనలలో ఎక్కువ పుస్తకాలు మనకి కావలసినవి,(వారు అమ్మాలనుకున్నవాటితో మనకి పనిలేదు)ఎలా కొనాలో చూద్దాం.

అంధ్ర దేశంలో, సాధారణంగా ఈ పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం డిసెంబరు - జనవరి మధ్య జరుగుతుంటాయి. శనివారం మొదలవుతాయి. ఆదివారం ముగుస్తాయి. నెలాఖరున మొదలవుతాయి. సుమారుగా మరుసటినెల మొదటివారాంతంలోపు ముగుస్తాయి. కారణం ఏమి లేదు. అప్పుడే ఈ "పుస్తకాల పిచ్చొళ్ళ" దగ్గిర డబ్బులుంటాయి. అవే కదా జీతాల రోజులు. పైగా మన డబ్బుతో సంక్రాంతికికూడా పని ఉంటుందన్నది మరిచిపోకూడదు.

ఇక ఆ ప్రదర్శనలో పాల్గొనే వారు శనివారం తమ పుస్తకాలకట్టల్ని తెరిచినా అవి సర్దడానికి సమయం తీసుకుంటుంది. అలాగే దూరాభారాన్నుండి వచ్చినవాళ్ళందరి పుస్తకల కట్టలన్ని వారికి అందకపోవచ్చు. అవన్ని అంది, వాటిని సర్దుకునేటప్పడికి వారికి ఏ సోమవారం మధ్యహ్న్నమో అవుతుంది. అంతే కాక కొంతమంది ప్రదర్శకులు కూడా రాలేకపోవచ్చు. వారి ఇబ్బందులు వారికుంటాయి. మరో చోట ఎక్కడన్నా పాల్గొనడం లాంటివి జరగవచ్చు. అందుకని వారు ఇక్కడకి ఆలస్యంగా చేరుకోవచ్చు. అనారోగ్యం కారణం కావచ్చు. వాళ్ళు మనుషులేకదా?

మొదటి సారి :
అందుకని ఏ మంగళవారమో ఒక సారి ఒక ప్రదక్షణ చేస్తే, ఎవరెవరున్నారో, ఏ ఏ పుస్తకాలు అందుబాట్లో ఉన్నవో తెలుస్తుంది. అంతేకాక ముందే తయారుచేసుకున్న జాబిత వారందరికి చూపిస్తే వారు ఏ పుస్తకాలున్నవి చెబుతారు. అంతే కాకుండా వారి దగ్గిరలేని పుస్తాకాలు తెప్పించడానికి వారికి మనం ముందే చెప్పడంవలన వారు వెళ్ళేలోపే మనకి ఆ పుస్తకాలను తెప్పించిపెట్టగలరు. తద్వారా మనం ఎంత డబ్బు సమకూర్చుకోవాలో కూడా తెలుస్తుంది.

ఎవరి దగ్గిర ఏమేమి పుస్తకాలున్నవో మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని, ఆ దుకాణం పేరు, సంభందిత వ్యక్తి పేరు, ప్రదనలో ఆ దుకాణానికి నిర్దేశించిన సంఖ్య దాని ఎదురుగుండా వారిస్తానన్న పుస్తకాల పేర్లు (రచయితల పేర్లతో సహా) వ్రాసుకోవాలి. మొత్తం ప్రదర్శనలోని అన్ని దుకాణాలు తాపిగా చూడాలి. హడావుడి ఏమి లేదు.

రెండో సారి :
ఇక రెండోసారి మళ్ళీ వెళ్ళాలి. ఇది ప్రదర్శన మొదలుపెట్టిన వారానికి వెళ్ళవచ్చు. ఉచిత సలహా ఏమిటంటే శనివారం మధ్యాన్నం ఐతే భేషుగ్గా ఉంటుంది. ఎందుకంటే సందర్శకులు ఎక్కువమంది ఉండరు. దుకాణ్ణాల్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం తాపిగా మనకి జవాబివ్వడానికి తయారుగా ఉంటారు. ఈసారి డబ్బుల్తో వెళ్తున్నాం కాబట్టి పుస్తకాలు మోయడానికి ఎవరినన్నా తోడు తీసుకెళ్ళాలి.ఒక మంచి నీళ్ళ సీసా కూడా తీసుకెళ్ళడం మరిచిపోవద్దు. మొదటి సారి వచ్చినప్పుడు చూసిన పుస్తాకాలుకొన్ని ఐపొయి ఉంటాయి. అవి మళ్ళి ఎప్పుడొస్తాయో కనుక్కుని, నమ్మకం కుదిరితే, కొంత సొమ్ము ఆ పుస్తకానికి "బయాన"గా ఇవ్వోచ్చు, వారు మన ప్రతిని మనకి ఉంచేందుకు.
దానికి రశీదు తీసుకోవడం మరిచిపోవద్దు. దానిమీద వారి ముద్ర, తేది, సంతకం ఉండాలి.

ముచ్చటగా మూడోసారి .
ఈ సంవత్సరం, ఇదే ఆఖరుసారి మనం ఆ పుస్తక ప్రదర్శనకి వెళ్ళడం. మనం కట్టలు మోసుకుంటూ వెళ్ళాం కదా, ఇంటికి? అబ్బో ఎన్ని పుస్తకాలో కొన్నాం అని సొరకాయలు కోసాం కదా. అప్పుడు, పక్క బల్ల వనజాక్షి గారు, ఎదురుబల్ల "రాముడు మంచి బాలుడు"గారు,మేడ మీద "ఆంటి"గారు, వాళ్ళు వాళ్ళకి కూడా "ఒక" పుస్తకం తెచ్చిపెడుదురు అని అంటారు కదా. ఆప్పుడు మనం బుర్ర ఇంచక్క ఊపేసి "అలాగే" అని అన్నాం కదా. ఆ పుస్తకాలు, మన పిల్లకి, మన పిల్లాడికి, మరి మన "వారి"కి, వారి "వాళ్ళ"కి పుస్తకాలు కొని ఇవ్వాలికదా? అందుకని ముచ్చటగా మూడోసారి వెళ్ళడమన్నమాట.

ఒక సారి, మళ్ళీ మన జాబితా బయటికి తీసి, దుకాణం పేర్ల ప్రకారం, సంఖ్యల ప్రకారం, ముందే చూసివున్నాం కాబట్టి, తిన్నగా ఆయా దుకాణాలకెళ్ళి, మనకి కావలసిన పుస్తకాలు తీసుకుని వచ్చేయ్యడమే.

పుస్తకాలు కొన్న ప్రతిసారి వారిచ్చే విక్రయచీటిలో పొరబాట్లు ఏవైనాఏమినా ఉన్నవేమో అని ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అలాగే ప్రతి దానిలోను కనీసం పది శాతం తగ్గింపు ఇచ్చారా అన్నదికూడా లెక్ఖ చూసుకోవాలి.చిల్లర నాణేల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకటికి రెందుసార్లు మనకి వెనక్కిచ్చిన చిల్లర లెక్కబెట్టుకోవడం మరవద్దు.

అఖరురోజున రద్ది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైతే పొద్దునే ఎండేక్కకుండానే వెళితే, త్వరగా వెనుతిరగవచ్చు.

దాదాపు అందరు దుకాణందార్లు ఒక చేతిసంచిలో, పుస్తకాలేసి ఇస్తారు. అన్ని సంచీలు మోసుకుని తిరగడం చిరాకు. అందుకని వారినే ఒక పెద్ద సంచి అడిగి అందులో ఈ చిన్న సంచీలు, పుస్తకాలు వేసుకోవడం సుళువు.

అలగే మనతో పాటు ఇంకేవరన్నా వుంటే, ఏదో ఒక దుకాణాన్ని బండ గుర్తుపెట్టుకుని అక్కడికే చేరడం మంచిది. ఓకవేళ అది మరిచిపొతాము అనుకుంటే ఆ దుకాణానికిచ్చిన సంఖ్యని గుర్తుపెట్టుకోవచ్చు. అలా ఐతే ఎవరు తప్పిపోరు. నలుగురైదుగురు వెళ్ళినప్పుడు, ఏవరైనా ఒకళ్ళు ఒకచోట నిలబడితే మిగతవాళ్ళు తమకి కావలిసినవి కొనుక్కుని మళ్ళి అక్కడికే చేరవచ్చు. ఇదొక పద్ధతి.

పుస్తకాలు - ముద్రణ - నాణ్యత
పుస్తకాలు కొనేటప్పుడు తప్పని సరిగ్గా పుటలన్ని క్రమం తప్పకుండా ఉన్నవా అని చూసుకోండి. అలాగే వెన్ను మీద కుడతారు. అలా కుట్టినప్పుడు కొంత పాఠం మనకు సరిగ్గా కనబడదు. ఆది కూడా చూసుకోవాలి. ముద్రణలో ఒకొక్కసారి అక్షరాలు అలుక్కుపోయి సరిగ్గా కనపడవు. అదికూడా జాగ్రత్తగా గమనించి ఇవేవి లేని మంచి ప్రతిని ఎన్నుకుని తీసుకోవాలి.

ఇలా కొనుక్కోవడం వల్ల మనం మనకి కావసిన పుస్తకాలు మాత్రమే కొనుక్కుంటాం.
అంతే కాదు, మన పరిమితులలోనే కొనుక్కుంటాం.
మన అభిరుచికి తగినట్టే కొనుక్కుంటాం.
- 0 -
ప్రతి జీవికి ఒక ఒంటరి సాయంకాలం ఉంటుంది. ఆ సాయంకాలం ఈ పుస్తకాలే అమేకి సహచరులు.

అలగే ప్రతి జీవి బూడిదలో కలిసిపోవాల్సిందే.
అలా కలిసిపోయేటప్పుడు కొందరు వీలునామలు వ్రాస్తారు. ఉన్న మేడలు, బంగారం ఏ పిల్లకి ఎంత, ఏ కోడలికి ఎంత, ఈ మనవడికి ఇంత, ఈ మనవరాలికింత అన్నట్టుగానే అంత మంచి పుస్తకాలని ఒక చోటికి చేర్చి, వాటిని అనాధలుగా వదిలేయవద్దు.

అవి ఎక్కడికేళ్తే పదికాలలపాటు, ఇంకో పదిమందికి తమ సహచర్యాన్ని అందివ్వగలవొకూడా చూసుకోవాలి. మన తరువాత గూడా మన నేస్తాలని వారు జాగ్రత్తగా చూసుకుంటారు అన్న నమ్మకం కుదిరినప్పుడే, వారిని అక్కడికి పంపే ఏర్పాట్లు చెయ్యాలి.
- 0 -
వెళ్ళండి, వెళ్ళి మీకు కావలిసిన పుస్తకాలు కొనుక్కోండి.
పదిమందితో పంచుకోండి.

Labels:

17 వ్యాఖ్యలు:

వికటకవి on October 19, 2007 at 8:52 AM   said...

నెటిజెన్ గారూ,
చాలా బాగా చెప్పారు. వివరాలు మరెప్పుడయినా సరయిన సందర్భములో చెబుతాను గానీ, మీరు వివరించిన పుస్తక ప్రపంచంలో పుట్టి పెరిగిన వాడిని. ఆ పుస్తకాలు, పుస్తక ప్రదర్శనలు, ప్రచురణ సంస్థల వెతలు బాగా చెప్పారు.

పుస్తకాల విలువ అప్పటికన్నా ఇప్పుడు మరెంతో బాగా తెలుస్తోంది. అసలు ఒకడికి మంచి పుస్తకం చదివే అలవాటు ఉంది అంటేనే, నా దృష్టిలో వాడో మిగిలిన జనాల కన్న ప్రత్యేకం. వాడి ప్రవర్తన, ఆలోచనా విధానమే వేరు. ఎందుకంటే, చదువుతున్నంత సేపూ వాడు తన మనసుతో మాట్లాడుతుంటాడు కదా. చదవనివాడు ఆ పని ఎప్పుడో కానీ చేయడు.

ఎప్పుడూ, అమెరికా వాళ్ళ గొప్పలు చెబుతాడన్న అపవాదు భరించటానికైనా సిద్ధపడి చెబుతున్నాను, ఇక్కడి సమాజం ఉన్నతికి పుస్తక పఠనం ఒక భాగమే అని నా అభిప్రాయం.

రానారె on March 5, 2008 at 8:22 PM   said...

మంచి టపా. ఇన్నాళ్లకైనా చూడగలిగాను. (గార్లపాటి ప్రవీణ్ కు థాంక్సు)

Anonymous on March 6, 2008 at 12:06 AM   said...

"పుస్తకాలు కొనేటప్పుడు తప్పని సరిగ్గా పుటలన్ని క్రమం తప్పకుండా ఉన్నవా అని చూసుకోండి." - ఈ విషయంలో నాకు రెండు అనుభవాలున్నాయి.. "ఏది చరిత్ర", "ఇదీ చరిత్ర" అనే రెండు పుస్తకాలు కొన్నాను.. అట్టలు మాత్రమే చూసి కొన్నాను. ఇంటికొచ్చాక చూస్తే లోపల మాత్రం రెండూ ఏదిచరిత్రలే! అచ్చేసిన వాళ్ళు చూసుకోలేదు, నేనూ చూసుకోలేదు. అంతకుముందు ప్రజాశక్తి వాళ్ళు నిఘంటు మేళా పెడితే ఇంగ్లీషు డిక్షనరీ ఒకటి కొన్నాను- అందులో కొన్ని పేజీలు లేవు. ఈ రెండోది పట్టుకోడం కాస్త కష్టమే గానీ మొదటిది మాత్రం తేలిగ్గా కనుక్కోగలిగేవాణ్ణి!

Anonymous on March 6, 2008 at 4:15 AM   said...

@ చదువరి:"అచ్చేసిన వాళ్ళు చూసుకోలేదు, నేనూ చూసుకోలేదు."
తప్పు.
ఈ రోజుకి కూడా , కవర్ పేజిలూ మార్చి, మొదటి పేజీలు మార్చి,పుస్తకాలు అమ్మడంలో ఘానాపాటిలు మన తెలుగు ప్రచురణకర్తలు.
ఏ పబ్లిక్ లైబ్రేరికి వెళ్ళి చూసినా మీకు ఈ పుస్తకాలు కనబడుతాయి.
పుస్తకాలని "చదువరి" లకు దూరంచేసి, ద్రోహం చేసిన, చేస్తున్న ప్రచురణకర్తలే ఎక్కువమంది ఉన్నారు. :(

రానారె on March 6, 2008 at 5:46 AM   said...

'తెలుగు కథ' పేరిట సాహిత్య అకాడెమీ వారు వెలువరించిన రెండవ సంచికను అంతర్జాలమార్గాన సంవత్సరం క్రితం కొని, ఇటీవలే తెరిచి చూస్తే కొన్ని పేజీలు లేవు. అజోవిభో వారికి చెప్పగానే, అన్నిపేజీలూ వున్నది ఇంకోటి పంపారు.

త్రివిక్రమ్ Trivikram on March 6, 2008 at 8:36 AM   said...

పుస్తకాలు కొనేవాళ్ళు ఎన్ని రకాలో భలే వివరించారు. నేనూ ఒకప్పుడు నాకు బాగా నచ్చిన పుస్తకాలు ఇతరులకు ఇచ్చి చదవమని ప్రోత్సహించినవాణ్ణే. ఐతే కొన్ని విలువైన పుస్తకాలు "పరహస్తగతం గత:" అయ్యాక ఇతరులకు ఇచ్చే అలవాటు దాదాపుగా మానుకున్నాను. నా అనుభవంలో అరుదుగానే ఐనా ఇంట్లో వాళ్ల నిర్లక్ష్యం వల్ల పాతపేపర్లలో కలిసిపోయి చెత్తకాగితాల దుకాణం చేరినవీ ఉన్నాయి.

కొన్ని పుస్తకాలు మనతో దాగుడుమూతలాడుతాయి: కాశీయాత్రాచరిత్ర (abridged) నాకు ఒకే ఒక్కసారి కనబడింది. తర్వాత కొనొచ్చులే అనుకున్నా. అంతే! మళ్ళీ నా కంటబడలేదు. విశ్వనాథ చిన్నకథలు కూడా అంతే! (విడిగా ఇక వెయ్యరట) ఇలాంటివాటి విషయంలో మంచి తరుణం మించిన దొరకదు. కనబడగానే కొనెయ్యాలి. శకుంతల Astrology for beginners రాశారని తెలిసి వెదకని చోటు లేదు. చివరకు భోపాల్లో హిగ్గిన్ బాధం లో దొరికింది. :)
పుస్తక ప్రదర్శనలు, పుస్తకాలు - ముద్రణ - నాణ్యత గురించి మీరు చెప్పిన విషయాలు పుస్తకాలు కొనేవాళ్ళందరికీ ఉపయోగపడేవే. తర్వాతి పాయింటు పెద్దయెత్తున పుస్తకాలు సేకరించేవాళ్ళందరూ తప్పక ఆలోచించవలసినది. సాధారణంగా పెద్దవాళ్లందరూ తమ పుస్తకాలను లైబ్రరీలకు ఇస్తూ ఉంటారు.

lalitha on March 6, 2008 at 9:27 AM   said...

I cann't say I read all your posts. But so far, this is the best.

Carani Narayana Rao on March 10, 2008 at 12:08 PM   said...

A good piece of article! Thank you.

As a bibliophile, the frequently faced problems, by me too, are
(1)that of missing pages in the Indian editions and
(2)the same book is being published under different titles/different covers confusing the readers to end up with multiple copies of the same book over a period.

'అంత మంచి పుస్తకాలని ఒక చోటికి చేర్చి, వాటిని అనాధలుగా వదిలేయవద్దు.'A very good advice. This prompted me to contemplate on bequeathing my huge collection of books to some one who would really take care of them.

Anonymous on March 10, 2008 at 8:56 PM   said...

ఇప్పటి దాక "నిన్ను నీ టపాలను నమ్మను" అన్న వారు 37% మంది.

@ వికటకవి: "సమాజం ఉన్నతికి పుస్తక పఠనం ఒక భాగమే" అన్న మీ అభిప్రాయమే ఈ బ్లాగర్ అభిప్రాయమ్ కూడా.

@సూర్యుడు: Thank you.

@రానారె: కృతజ్ఞతలు మీకు, (మీ గార్లపాటి ప్రవీణ్‌కు).

@త్రివిక్రం: మీరు వెదుకుతున్న "కాశీ యాత్ర చరిత్ర" ఏనుగు వీరాస్వామి గారిదయితే- అది ప్రచురించినది- Asian Publishing Services - New Delhi. Abridged edition ఒక ప్రింటే వచ్చినట్టు గుర్తు. అమెజాన్ /ఈబే‌లోప్రయత్నించండి.

@lalitha: thank you

@Carani Narayana Rao: thThank you. If you are in Chennai, please consider Potti Sriramulu Hall in Mylapore. The Chandurs on Santhome High Road, publishers of Jagati or Sri B S R Krishna, may be able to help you take a better decision. Chennai doesn't not have a good Telgu public library.

సుగాత్రి on March 12, 2008 at 2:30 AM   said...

"చిరిగిన చొక్కా ఐనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో" - ఇదీ మాట. ఐతే అన్నది వీరేశలింగమేనా అని నా అనుమానం. నారాయణరావుగారూ! 'multiple copies of the same book': సాధారణంగా అనువాదాల విషయంలో ఇలా జరుగుతుందనుకుంటా. నాకు బాగా నచ్చిన (అనువాద) పుస్తకాల్లో ఒకటి రైలుబడి (టెట్సుకో కురొయనాగి జపనీస్ మాతృకకు HBT వారి అనువాదం). తర్వాత అదే అనువాదాన్ని NBT వాళ్ళు టోటో-చాన్ అని వేశారు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on October 9, 2008 at 11:20 AM   said...

ఇన్నాళ్ళకు చూసా,ఇవ్వాళో రేపో చదువుతా,అరాయించుకునేది,ఆచరించేది ఎప్పుడో మాత్రం చెప్పలే్ను.

సుజాత on December 2, 2008 at 10:52 PM   said...

ఈ టపా చాలా బాగుంది నాకు! నేను నల్లకుంట శంకరమఠం ఎదురుగా, చిక్కడపల్లి ఫుట్ పాత్ ల మీద పాత పుస్తకాలమ్మే వాళ్ళకి నా ఫోన్ నంబర్లు ఇచ్చి, ఏదైనా లెండింగ్ లైబ్రరీ వాళ్ళు సదరు పాత పుస్తకాల వాళ్లకి తమ సరుకు అమ్మగానే నాకో కాల్ చెయ్యమని చెప్పేదాన్ని ఇదివరకు. అలా నేను కొన్ని మంచి పుస్తకాలు కొన్నాను కూడా!

netizen నెటిజన్ on December 7, 2008 at 1:55 AM   said...

@సుజాత; ఫుట్ పాత్ ల మీద పాత పుస్తకాలమ్మే వాళ్ళూ, వందల మైళ్ళ దూరంలో ఉన్న నా మిత్రుడు కి ఎస్.టి.డి కాల్స్ చేస్తే, ఒక రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటున్నాడు. అలాంటి పుస్తక "ప్రేమికు" లున్నంత కాలం మనకి మంచి పుస్తకాలు వస్తూనేఉంటాయి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on December 7, 2008 at 4:38 AM   said...

సుజాత గారు అసలు మంచి పుస్తకాలు అంటే?

నెటిజన్ గారు పుస్తకప్రేమికులనగా నేమి?

te.thulika on December 17, 2008 at 3:29 AM   said...

చాలా మంచి టపా నెటిజన్ గారూ. ఉపయోగకరమైన విషయాలు నీటుగా చెప్పేరు. అజోవిభోవారిని మెచ్చుకోవాలి. నేను ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యం కొన్నప్పుడు ఒకవాల్యూములో కొన్ని పేజీలు లేవంటే మరో కాపీ పంపేరు. కానీ నాకు అక్కర్లేని పుస్తకాలు అయాచితంగా వచ్చినవే ఎక్కువ :)

Dr. C. JAYA SANKAR BABU డాక్టర్ సి. జయ శంకర బాబు on February 2, 2009 at 9:40 AM   said...

పుస్తకాల గురించి బహు చక్కగా రాశారు, అభినందనలు. ఈ పుస్తకాల పిచ్చితో ఇల్లన్నీ నిండిపోతున్నాయి గానీ, నాకు చదివేందుకే తీరిక దొరకటం లేదు, ఇక ఈ బ్లాగోతం ఒకటి. http://saahitee.blogspot.com/
డాక్టర్ సి. జయ శంకర బాబు

Post a Comment