సాహిత్య సేవకులారా, పాఠకులారా బహు పరాక్!

రచయిత వ్రాయాలి.  రాసినందుకు తృణమో ఫణమో పొందాలి.  ఆ ఆర్ధిక ప్రోత్సాహం మరిన్ని రచనలు వెలువడడానికి ప్రోది చేస్తే అంతకంటే కావల్సింది ఏముంది?

కాని రచయితలందరూ భాగ్యవంతులు కారు.  తమ రచనల ద్వారా తమ భావజాలాన్ని పాఠకులకి అందించడానికి కొందరు రచయితలు తమ రచనల ప్రచురణ కోసం ఇతరులమీద ఆధారపడవలసి వచ్చింది.  ప్రచురణకర్తలు వచ్చారు. లాభాసాటిగా ఉంది కాబట్టి ప్రచురణల అమ్మకాల మీద లాభాపేక్షతోనే వారు ప్రచురణ రంగాన్ని వ్యాపారంలో ఒక భాగం చేసారు.

ఈ లోపు హక్కుల ప్రశ్న వచ్చింది.  అంటే కాపి రైట్స్.  కొంత డబ్బు పెట్టుబడి పెట్టి ప్రచురించాను కాబట్టి తన పెట్టుబడికి కొంత కనీసపు హామీ ఉండాలన్నది ప్రచురణకర్త వాదన.  రచన తన సృష్టి కాబట్టి రచన మీద తనకు హక్కు ఉండాలన్నది రచయిత వాదన.

నిర్ణీత కాలం లేదా నిర్ణయించిన ప్రతుల సంఖ్యని ఆధారంగా చేసుకుని రచయితలు ప్రచురణకర్తలు ఒక ఒప్పందానికి రావడం మొదలయ్యింది.

రచయిత జీవిత కాలం తన హక్కుల మీద అధికారం ఉంటుంది.  రచయిత మరణానంతరం ఆ రచయిత రచనలమీద హాక్కులెవరికి చెందుతవి అన్నది ప్రశ్న. రచయిత జీవిత కాలం తరువాత అతని వంశస్థులకి కూడ ఆ రచయిత రచనల మీద హక్కులు చెందాలన్న వాదనలో న్యాయం ఉంది కాబట్టి బెర్న్ కంన్వెషన్ ప్రకారం ఒక రచయిత తన రచనల మీద తన జీవితకాలం, తన మరణానంతరం యాభై సంవత్సరాలు, హక్కులు కలిగి ఉంటాడని ఇదే అంతర్జాతీయ ఒడంబడిక అని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి.  ఇది రచయిత కనీస ప్రాధమిక హక్కు అని కూడ తీర్మానించుకున్నవి.అంతే కాక తమ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ మౌలికమైన హక్కులకు భంగం వాటిల్లకుండా ఆయా దేశాలు తమకంటూ ప్రత్యేకమైన హక్కులు / చట్టాలు కూడా చేసుకోవచ్చని తీర్మానించుకున్నవి.

ఇది స్థూలంగా రచయితలు, రచనలు, వాటి పై హక్కుల విషయం.ఇక ఆంధ్ర దేశానికి, తెలుగు సాహిత్యానికి వద్దాము.

రాజకీయ భావజాలాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళి వారిని చైతన్య వంతుల్ని చెయ్యాలని, మత పరమైన తమ నమ్మకాలను పుస్తకాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లాలని కొన్ని మత సంస్థలు, శాస్తీయ విజ్ఞానంతో, ప్రజల మత మౌఢ్యాలని, మూఢ నమ్మకాలని తొలగించాలన్న ఆశయాలతో మరికొన్ని, ఇలాగా కాలానుగుణంగా వివిధ రకాల ప్రచురణ సంస్థలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టినవి.

నేడు రాజకీయ సిద్ధాంతల వ్యాప్తికోసం మొదలైన ప్రచురణసంస్థలు, తగిన తగ్గింపులిస్తే నిత్యానంద స్వామి రంకు పురాణాన్ని, దానితొ పాటే దస్ కాపిటల్‌ని, భగవద్గీతని, బైబులుని, ఖురానుని కలిపి టోకున అమ్మేయ్యడానికి కూడా వెరవడం లేదు.  శవాలమీద పేలాలు ఏరుకునే రకాలు ఇవి. (వామ పక్షా సిద్దాంతాల పునాదుల మీద నిర్మించిన ప్రచురణ సంస్థలు కూడా ఇలాంటివాటిని ప్రోత్సహించడం, ఆ సంస్థల కార్యకలాపాలను నిర్దేశిస్తున్న సమితి సభ్యుల ఇంటలెక్యుయల్ బాంక్‌రప్ట్సి (Intellectual bankruptcy) కి నిదర్శనం).

ఇది ఒక ఎత్తైతే, కాపిరైటా అదేమిటి అని ప్రశ్నించే కారల్ మార్క్స్ రోడ్డు ప్రచురణకర్త గోదాముల నిండా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని కూడబెట్టి నల్లబజారులో అమ్ముకుంటున్నాడు.

ఇదే అదనుగా 'కలాపోసన' చేసే కలాపోసకులు లాగా, సాహిత్య సేవ జేసే సాహిత్యసేవకులు మొదలయ్యారు.  వీరి పనేమిటంటే, వారసులు లేకుండా చనిపోయినవారి పుస్తకాలని ప్రచురించడం. వీరి పరిస్థితి మరీ ఘోరం, దారుణం.

ఈ ప్రచురణకర్తలు వారి జేబులో నుంచి పెట్టు బడి పెట్టి చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రజల మీద, పాఠకుల మీదా పడి చందాలు పీక్కుని, లాక్కుని పుస్తకాలు ప్రచురించడం.  అదేమిటంటే సాహిత్య సేవ అనెయ్యడం.

పాపం కొంత మంది పాతకులు కామోసు అనుకుని ఈ ప్రచురణ కర్తలని తమ భుజాల మీద మోస్తున్నారు.  

ఈ సాహిత్య సేవ చేస్తున్న ప్రచురణకర్తలకొక సూచన.

సాహిత్యసేవ చెయ్యండి.  ఇది విరాళల రూపంలో వచ్చిన సొమ్ము.  ఈ పుస్తకానికి ఇంత ఖర్చు ఐనది.  మిగిలినది ఇంత.  దీనితో ఈ పుస్తకము ప్రచురిస్తాము, లేదా ఈ సాహిత్య సేవా కార్యక్రమం చేద్దమనుకుంటున్నాము అని చెబితే బాగుంటుంది.  అంతే కాని, అడిగేవాడు లేడు కదా అని ఈ ప్రచురణ కర్తలు ఇలా చెయ్యడం బాగోలేదు. దీన్ని సాహిత్య సేవ అనరు.  సాహిత్యం పేరుతో జరిగే "సాహిత్య దోపిడి" అంటారు.
పా.సూ:
ఒక పుస్తకాభిమాని విజ్ఞప్తి లో కొంత పాఠం :
.... ఈ బృహత్కార్యంలో భాగం గా దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు, ప్రమోద వంటి బాలల మాసపత్రికలకోసం రచించిన "అగ్ని మాల", "మృత్యులోయ" సీరియల్స్ ను సంపుటిగా పోయిన యేడాది మన ముందుకు తెచ్చారు. ఈ సారి "కపాల దుర్గం" తో పాటు మరొక ఇరవై సీరియల్స్ ను మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు. ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.

మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయామైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి. ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు *** ** ****
(...... .... .....ట్)పేరిట చెక్ పంపించగలరు

స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ

మీ నేస్తం
****

నేనెవరు?

నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.పూర్తిగా చదవండి ...