అరుణోదయం కావాలి!

Posted by netizen నెటిజన్ on Thursday, January 29, 2009
సరే. తుఫాను వెలిసినట్టుందిగా. ఇక  మొదలెడుదాం!
 అరుణం గారు ఒక కధ రాసారని తెలుగు బ్లాగ్ లోకంలోకి ఒక పెద్దాయన  వార్త చేరవేసారు.  అప్పటికి అరుణం లో ఆ కధ లేదు.  సరేలే, అనుకున్నారేమో, కతే అనుకున్నారు, కతయిత్రి గారు. కాని ఇంత కత అవుతుందని ఊహించి ఉండరు.  ఆ కతని తన బ్లాగులో పోస్ట్ చేసేసారు. ఇకనేవుంది.  అందరూ పోలోమని అరుణం గారు 'ఎవరికి తెలియని కధలివిలే' చదివేసేసి మాములుగా కొందరనేటట్టు బ్లాగుంది అని, మరి కొందరనేటట్టు  అభినందనలు (అంటే అభినందనలు అని కాదు కాని రమారమి అదే అర్ధం వచ్చేటట్ట్లు అని చదువేసుకోండేం) అని వగైరా వగైరాలు గా కమెంటేసారు.      

సరే, ఇక ఆ వగైరా, వగైరా లో చేరని  వారు కొంత మంది ఉంటారు కదా! అందులో ఒకరు తమకు తోచిందేదో కమెంటారు.  అరుణం గారికి అది నచ్చలేదు. బహుశ అది బ్లాగు కర్త దృష్టిలో  సంబంధం లేదని పించిందేమో?! అందుకని నాబ్లాగుకి నేనే మహ రాణిని, నాకు నీ కమెంటు నచ్చలేదు కాబట్టి సదరు కమెంటుని తీసేస్తానోచ్ అని తీసిపారేసింది.

అహా! నీ బ్లాగుకి నువ్వు మహారాణివి ఐతే, నేను నా బ్లాగ్ సామ్రాజ్యానికి అస్తమించని రవిని నేను , అంటు సదరు సూర్యుడు గారు తమ బ్లాగులో ఆ పారేసిన, ఏది, ఆ విసిరి పారేసిన కమెంట్ని, మహా ప్రసాదంగా కళ్ళకద్దుకుని తన బ్లాగులో పెట్టుకున్నాడండి.   (ఎంతైనా తనుకన్న కమెంట్ కదండి బాబు, కన్న కడుపుకి తెలుస్తుందండి, ఆ కడుపు తీపి )

సరే ఆ దారిన పోయిన దానయ్యలు వూరుకోరుగా! హెల్లొ, సన్ గారు, యేవిటీ కమెంట్, దీని కత ఏవిటి, ముందు వెనక ఫ్లాట్ గా ఉంది, జీరో సైజు లాగున, హెడ్డు, టెయిలూ లేకుండా ఉంది, ఇలా త్రిశంకు స్వర్గంలో పైన ఫాను లేకుండా, కింద స్టూల్ లేకుండా మీ కమెంటు అలా , వ్హిస్కిలో గుడ్డు లాగ తెలుతా ఉంటే, సూడ్డానికి, నిండా కష్టంగా ఉండాది, బేజారుగా ఉండాది అప్పా, అసలు స్టోరి సొల్లప్ప అనగానే సదరు  స్కై లోని సన్ గారు తన కంపోస్ట్ (కమెంట్  ప్లస్ పోస్ట్  = కంపోస్ట్ అని చదువుకోండేం? అశుద్దంతో తయారు చేసే కంపోస్టు వేరండి బాబు, అది ఇది గాదు, ఇది అది గాదు) సదరు అరుణోదయ కిరణాలకి (తన కంపోస్టులోనే లెండీ)ఒక గొళ్ళెం బిగించి కూర్చున్నారు.

కాగడ పట్టుకుని చీకట్లో చీకటి పనులు చేస్తున్న ఒక బ్లాగాంధుడి కి సదరు కధ తెగ నచ్చేసి,  కధ వెనుక చీకటి లో జరిగిన కధని తన బ్లైండ్ కళ్ళతో ౩డిలో  విజుయలైజ్ చేసేసి, నల్ల మందుతో మసక బారిన తన బ్లా(ం)క్ బుర్రతో ఒక కధ అల్లేసి, తనో గొప్ప కధకుడని పిచ్చ, పిచ్చగా ఫీల్ ఐపొయ్యి, ఈ   స్క్రీన్ ప్లే అంతా  కూడా తెగ నచ్చేసి, అస్సలు ఆ కధలోనే పెద్ద బూతుందని ఇంకా హేమిటేమిటో, హెవిటేవిటో రాసుకున్నాడు.(ట) 

దివిటి పట్టుకుని యెతికినా.
కూడలి లో. 
లె.
టూబ్ లైట్ ఏసి ఎతికినా.
లే.
అప్పుడు వెలిగింది.
కూడలిలో శరత్త్కాలానికి ప్రవేశం లేదు, అలాగే ఈ కాగడా లైట్ కి కూడా కూడలిలో అవుసరం లేదనిజెప్పి.
ఒసొస్.  ఇది ఇక్కడ కనబడదు.  జల్లెడెయ్యాల అని.  జల్లెడేసినా.  అప్పుడు కనబడింది ఆ కాగడ ఎల్తురు. 
అప్పుడు వచ్చింది.

కోపం.
చాలా కోపం వచ్చింది.
ఈ బ్లాగుల మీద.
ఈ బ్లాగ్ లోకం పెద్దల మీదాను.

కళ్ళాపి జల్లి, చక్కగా అలికిన వాకిలి అండి. ముగ్గులతో ముద్దుగా, ముచ్చటగా  ఉన్న వాకిలండి.  దాని మీద  ఒళ్ళంతా కురుపులతోను, రసి కారుతున్న ఒక పిచ్చి, గజ్జి కుక్క చండాలం చేసి చీకట్లోకి పారిపోయిదండి.   దాన్ని వెతికి పట్టుకుని, దాని జాతి, కుల గోత్రాలతో సహ  పరిచయం చేయాల్సిన అవసరం ఉందా?  పిచ్చి పట్టిన గజ్జి కుక్క ఇక్కడ ఉంది అని బ్లూ క్రాస్ వాడికో, మునిసిపాలిటి వాడికో ఒక ఫోను కొట్టి దానికి చెయ్యల్సిన ఏర్పాటు చేస్తే పొయ్యేది కదా?  

దానికి వాడి కత, వీడి కత, యెంకన్న కత, సుబ్బయ కత సెప్పాలాండి, యేను?

ఎలాగోలాగా ఈ బ్లాగ్ ప్రపంచం లోకి వొచ్చి పడ్డానండి.  చాలా మంది సెప్పారండీ, అబ్బో తట్టుకోవడం కట్టం, అందుట్లో  ఒంటరి ఆడది తట్టుకోవడం సానా కష్టం అని.  నేను తగ్గలేదండి. వెనకడుగువెయ్యలేదండి.  కాని సూత్తునే ఉన్నానండి.  ఆమధ్య లలితమ్మ గోరు వెళ్ళి పోనారండి. అంతకు ముందే ఒక రచయిత్రి గారు అమ్మ్మో, అంటూ  పారిపోయినారంట.  మొన్న పూర్ణమ్మ గారు బై చెప్పిసినారండి.  నిన్న అరుణం మ్మ గారు టా,టా సెప్పడానికి రెడి ఐపోనట్టు కనబడతాఉందండి.   

తెలుగు బ్లాగ్ లోకం లో ఒక  ఆడ కూతురు తన ఇష్టం వచ్చినట్టు రాసుకో గలిగిన రోజు ఎప్పుడు వస్తుందో?
అరుణం గారు,  మీరు ఇక్కడ దయిర్నంగా మీ కతలు రాసుకోండి!
సభ్య నామాలు, సంకేత పదాలు అఖ్ఖర్లేదండి!
అది శీలం మీదైనా, అశ్లీలం మీదైనా!
మన దేశంలో కుక్కలు రాదారి మీద తిరుగాడుతునే ఊంటాయి.
బయ పడమాకండి!     
ఇంత ఆలేసంగా ఈ టపా ఎందుకంటారా?
భవిష్యత్తులో మరి ఇలాంటి పొరబాట్లు జరగ కుండా ఉంటాయనండి!                                           
                                                                                                                                                                           * ఆడోళ్ళకితోలుమందంగాఉంటేబాగోదండి.
                      వారు సున్నితంగానే ఉండాలి అని ఒక భవదీయుడి  అభిప్రాయం,సుమండీ.పూర్తిగా చదవండి ...

ఫరవా ఉంది

Posted by netizen నెటిజన్ on Thursday, January 22, 2009
నిన్న రాత్రి జీ తెలుగు(?) లో, క్రేన్ వక్క పొడి వారు సమర్పించే, ఔత్సాహిక (?) బాల గాయకులను పరిచయం చేసే "లిటిల్ చాంప్స్" అనే కార్యక్రమం ని (రాత్రి ౯ నుంచి ౧౦ దాకా) చూడడం తటస్థించింది. పదాతి దళంలో ఉద్యోగ చేసి, తరువాతి కాలంలో, తెలుగు చలన చిత్ర రంగంలో గేయ రచయితగా స్థిరపడిన -"భువనచంద్ర" ఆ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత. ఆయనతో పాటుగా, కీ.శే. సాలురి రాజేశ్వర రావు గారి మూడవ కుమారుడు , (బాబు మొదటి వాడు, వాసు(దేవ) రావు రెండవ వాడు) సంగీత దర్శకుడు (చిన్న కోటి అనేవాడు ఆఖరివాడు(పెద్ద)) కోటి మరొక న్యాయ నిర్ణేత. ఇంకొ మహిళ మూడవ న్యాయ నిర్ణేత గా పాల్గొన్నారు.
ముందే చెప్పుకున్నట్టు ఇది బాల గాయకులను పరిచయం చేసి, వారిలో అగ్రగాములను ఎంచుకునే కార్యక్రమం. నిన్న చూసిన ఆ కార్యక్రమంలో బాలికలు ౧౨ సంవత్సారాలలోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాప వయసు ౬ సంవత్సరాలు. పాల్గొన్న ఆ ఒక్క బాలుడి వయస్సు ౧౨ సంవత్సరాలు.
ఇక మన న్యాయ నిర్ణేతలు వాడిన తెంగ్లిష్ ఫ్రేజ్ లు మచ్చుకు కొన్ని:
" కొంచెం ప్రాక్టీజ్ చేస్తే బాగుంటుంది".
" ఒ.కే. గుడ్. గాడ్ బ్లెస్ యు".
" బానే ఉంది. కాని తినేస్తున్నావు. అందుకనే ఫీల్ పోతోంది'.
" యూ ఇన్వాల్డ్ యువార్సె ల్ఫ్ ఇం ది సాంగ్. బాగుంది. కీప్ ఇట్ అప్".
"నీది హస్కి వాయిస్. మెలొడి సాంగ్ ఎంచుకున్నావ్".
"సూపర్".
"కాన్ఫిడెంస్ పుట్టలు పుట్టలుగా ఉంది".
"ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు?"
"నీ సిన్సియారిటి బాగుంది".
"అవుట్ స్టాండిగ్. సింప్లి సూపర్బ్. సూపర్".
"వండర్ఫుల్".
"సింగింగ్, ఫీల్ సుపర్బ్".
"ఎక్సెల్లెంట్".
"..హిందుస్తాని మ్యూసిక్..కర్నాటిక్ మ్యూసిక్.."
'..రెండరింగ్..".
"అప్ప్రిసియేషన్..".
"ఒరిజినల్ వర్జన్..".
"..కంపొజిషన్..".
"ఆడియంస్ రవుండ్ ఆఫ్ అప్లాజ్..".
"..వందర్ఫుల్ వాఇస్.."
"గాడ్ బ్లెస్ యూ".
న్యాయ నిర్ణేతలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ,ఆ ౬ నుంచి ౧౨ ఏళ్ల పిల్లలకు,వారి తల్లి తండ్రులకు ప్రోత్సాహమిస్తూ,వారికి తమేదో గొప్ప సేవ జేస్తున్నామని భ్రమిస్తూ,కార్యక్రమాన్ని తిలకిస్తున్న అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని వెర్రి వెంగళప్పలను జేస్తు వాడిన ఆంగ్ల పదజాలం ఇది.
ఇక ఆ పిల్లలు, "థాంక్యూ" లు, క్యూ లు కట్టినవి.
ఇంతకి హస్కీ వాయిస్ తో, జార్జియస్ గా ఆ పిల్లలు పాడినవి, తమ విరహన్ని "ఫీల్" తో నింపి పాడిన పాటలు. సదరు కార్యక్రమంలో "సైడ్ కిక్" "మంకి" వాడు ఒకడు, ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడి తో వాడి "గెళ్ ఫ్రెండ్" గురించి ముచ్చటీంచాడు. 
ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడు పాడిన పాటలో ఒక "లీరిక్" -
"కాటుక కళ్ళతో కాటు వేసావు నన్ను ఎప్పుడో".
నాకిప్పుడు, నా కూతురి కళ్ళకి కాటుక పెట్టి, జడలో పూలతో పాఠశాలకి పంపాలని ఉన్నది.
పంపాలా వద్దా అన్నది తెలియడం లేదు.
" ఫరవాలేదు, ఆ కుర్రాడికి "కాండం" లు కూడా జేబులో పెట్టి పంపుతాం", అంటున్నారా?
మీకు ఫరవ లేదు. సరే, కాని నాకు ఫరవ ఉందే!పూర్తిగా చదవండి ...