ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్య పాత్రలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్య పాత్రలు

రచయితలు, రచయిత్రుల సంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో ఏ ఒక్క కధలో కాని, నవలలో కాని హాస్యం మచ్చుకి కనపడటం లేదు. మరి వీరి దృష్టి, హాస్యపాత్రలమీద ఎందుకులేదో తెలియటంలేదు! నవలలో కాని, కధలలో కాని హాస్య పాత్రలుంటే కధ మరింత రక్తి కట్టిస్తుంది కదా!

వెనుకటి సాహిత్యం చూస్తే ఎంత చక్కని హాస్యపాత్రలున్నవో తెలుస్తుంది. పౌరాణికాలు, మొదలు పానుగంటి వారి సాక్షి దాక హాస్య రసం చిప్పిల్లుతా ఉంటుంది.వీరేశలింగంగారి ప్రహసనాలలోని పాత్రలు, గురజాడవారి కన్యాశుల్కంలోని గిరీశం, పానుగంటివారి సాక్షిలో జంఘాల శాస్త్రి, ఇవన్నీ మనం మరువలేని పాత్రలు. ఇవన్నీసాంఘికాలక్రిందే లెఖ్ఖ కదా? ఇక చిలకమర్తి వారిని ఎలా మర్చిపోతాం!

ఒకప్పుడు ఇవన్నీమనకు ఆరాధ్య కధలు, నవలలు. మనకు హాస్యం ఒక్క సాహిత్యంలోనే కాదు, నిత్య జీవితంలోను ముడేసుకుంది. మన పగటి వేషగాళ్ళ, పిట్టల దొరలు, ఇప్పుడు ఫాషన్ కాకపోయినా తోలుబొమ్మలాటల్లో కూడ (మొరటు హాస్యం అయినా) ఎంతో ఉంది.

ఎన్నో విధాల మన జీవితంలో సాంఘికంగా, సాహిత్యపరంగా తీగలాగా పెనవేసుకుపోయిన హాస్య రసానికి ఈనాటి ఆధునిక సాహిత్యంలో స్థానం లేకపోవటం చాలా విచారించవలసిన విషయం. నేటి రచయితలు, రచయిత్రులు అహ్లాదకరమైనట్టి హాస్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో మరి!

పద్యరచనలో కూడా చక్కని హాస్యం మిళితమైన రచనలువెలువడ్డవి. స్వర్గీయ భోగరాజు నారాయణమూర్తి గారి "పండుగ కట్నం" చెప్పుకోదగ్గది, నవ్వించగలదీ. ఆనాటి సంఘంలో స్త్రీ కి ఉన్న విలువలు తెలియచెప్పేది.

శరభరాజనే లోభి, కుమార్తె వివాహం చెయ్యాలనుకుంటాడు. డబ్బాశ మూలంగా తన కుమా ర్తేను ఒక వయసుమళ్ళినవాడికిచ్చి వివాహం చేయాలని చూస్తాడు. కాని ఇది అతని భార్యకు, పిల్లకు ఇష్టం ఉండదు. వాళ్ళని సమ్మతిపరచటానికి పెళ్ళి కొడుకుని సమర్ధిస్తాడు. అది ఎలా అంటే -

"కామరాజని పెళ్ళి కొడుకు ఉన్నాడు. అతను యోగ్యుడు కాకపోయిన ఆస్థి అంతా అతనిదే. వయస్సు నలుబది సంవత్సరాలని చెబుతారు కాని ౩౦కి మించి ఉండవు. అందమైనవాడు కాకపోయిన మంచి ఏపుగా ఉంటాడు. సీతమ్మ ఇష్టమని తరచూ రాస్తుంటాడు. గిట్టని ముండాకొడుకులు, ముండ ఉందని చెబుతారు. పెండ్లాము లేని ధనవంతుడు, వాడు ఏమి ఏడిస్తే మనకెందుకు? మనం పిల్లనిద్దాం", అని అంటాడు.

ఆఖరికి పెళ్ళి ఖర్చులుకూడా తప్పుకోవాలని ఏకరాత్రి వివాహం అంటాడు.
"ఏకరాత్రి పెండ్లి యైనచో జాల
వరకు ఖర్చు తగ్గవచ్చు మనకు
చూడవచ్చిన చుట్టాలచే నిల్లు
గుల్లగాదు, డబ్బు చెల్లిపోదు".

వివాహముహూర్తం నిర్ణయమైనదని విని పాపం పెండ్లికుమార్తె బెంగ పెట్టుకుని మంచం ఎక్కుతుంది. తల్లి, కూతురు మనసు మేనల్లుడియందు అనురక్త అని తెలుసుకుని వైరిప్పించమని శరభరాజుతో చెప్పింది. అతను ఆరణాలు పెట్టి వైరెందుకు అంటూ, డబ్బున్నర కవరందుకుని రాడా?" అంటూ కవరు రాస్తాడు.

ఇదంతా ఒక ఎత్తు. దీని తరువాతిది మరొక ఎత్తు.ఇందులో ఇంగ్లిష్ ‌దొరసాని అచ్చమైన ఇంగ్లిష్‌లో పద్యాలు చెబుతుంది. మచ్చుకి ఒకటి:

"పోస్టాఫిసున పోస్టుజేయుడొక కార్డు రేపే నా మాటలన్
టెష్టున్ జేయగవచ్చు స్టార్టిమిడియట్లీయంచు వైరిచ్చుటే
బెస్ట్అన్నింటను వైరుచూచుకొనుచున్ వేవేగమే మైల్‌రైల్లో
నే స్టార్టవుతాడారణాలేకదా మీకేమైనా వేష్టైనచోన్".

ఈ విధంగా పరభాషని కూడా ,మనవాళ్ళు తలచుకోకుండా ఇంగ్లిషు పదజాలంతో అడుగడుగునా హాస్యం ధ్వనించే విధంగా చక్కని పద్యాలు కూడా అల్లారే. సినిమాలవారే కావాలని హాస్యపాత్రలని సృష్టిస్తున్నరే - దేనికి? ప్రజారంజనానికే గదా! మరి మీరు హాస్యం అంటే నిర్లక్షంచేస్తున్నారెందుకు? వేదం వారి ప్రతాపరుద్రీయంలో పాత్ర ఔచిత్యం చెడకుండా, పిచ్చివాడు, పేరిగాడు మొదలైన పాత్రలను ఎంత చక్కగా చివరంతకు మలుచుకువచ్చారు. హాస్య ప్రధానమైన సాహిత్యం మన చేతుల్లోనే వికసించాలి. మన పెద్దలు విత్తులు నాటారు. అవి చిన్న మొక్కలుగా నిలిచిపోయినై. వాటిని పెంచి హాస్యంలొ, హాస్యం అక్షరం అక్షరం విస్తరించే విధంగా వికసింపచేయవలసిన బాధ్యత ఈనాటి , రచయితలు, రచయిత్రుల మీద ఉంది.

ఈనాడు మనకొచ్చే సాహిత్యం ఒకే మూసలో తయారై వస్తున్నది. పాత సారానే కొత్త సీసాలలో పోసినట్లు సీరియల్సు కానివ్వండి, కధలు కానివ్వండి, రచయితలు, రచయిత్రులు ఒక దృక్పధం నుంచే వ్రాస్తున్నారని నేను భావిస్తున్నాను. రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నకొలది సరుకులో నాణ్యం, చెప్పే విషయం యొక్క విలువలు తగ్గిపోతున్నవి. మన నిత్య జీవితంలోని హాస్య మధురిమలు ప్రదర్శించే రచనలను కావాలనుకోవడం అసమంజసమేమి కాదుగదా? ఏదో ఒక విషయం మీదే దృష్టి పెట్టుకుంటే ఆ రచనలు ఎక్కువ కాలం మనలేవు. మనకున్న అసంఖ్యాక రచయితలలో కొద్ది మందిని మినహాయిస్తే, మాములుగా వచ్చే పత్రికల్ని చూస్తుంటే ఏ విధమైన మంచి కధా చదివాము అన్న తృప్తి ఉండటంలేదు.

మన పగటివేషగాళ్ళూకూడా ఆశుకవిత్వంలాగా అప్పటికప్పుడు హాస్యం సృష్టించగలరు. ఒక చక్కని చిన్న ఉదాహరణ: నిత్య జీవితంలో మనం రోజూ వండుకు తినే కూరగాయలమీద తాత్కాలికంగా శ్లోకాలు సృష్టించి రాగ, తాళయుక్తంగా చదివి మనల్ని కడుపుబ్బ నవ్వించగలరు. ఈ క్రింది శ్లోకం చూడండి.

"కాచి కాచీ ములంకాయ కాయవే పొట్టి కాకరి
కాయానాం వంగ పింజానం కురానాం గుజ్జు పచ్చడి!"

ఇది చదివారు కదా. ఇంత హాస్యం మన నిత్య జీవితంలో పాలు నీళ్ళుగా కలిసిపోయి ఈనాటికి మనల్ని మనలని వుర్రుతలూగిస్తుందే, అట్టిదానిని నిర్లక్షం చేయడం తగునా మన రచయితలకు?

ఈ బ్లాగు వ్రాసినందుకు రచయితలు, రచయిత్రులు, బ్లాగర్లు, బ్లాగరీలు, కోపగించుకోకుండా మన సాంఘిక జీవితంలోని హాస్య ప్రధానమైన ఘట్టాలని కూడా తీసుకుని చక్కని హాస్యప్రధానమైన కధలను, నవలలను కూడా సృష్టించగోరుతున్నాను. మీరు పెట్టిన వరవడే భావి రచయితలకు మార్గ దర్శకమై మన ఆధునిక సాహిత్యంలో హాస్యం మూడు పూవులు, ఆరు కాయలుగా విరాజిల్లగలదని ఆశిస్తున్నాను.

* విహరిణి పుణ్యామా అంటూ అచ్చుతప్పులుండే అవకాశం ఉంది. ఎక్కించినవెంటనే ప్రచురించాలనే ఆ దురదా ఉంది. అందువల్ల అప్పుతచ్చులని సరిదిద్దుకుని చదువుకోగలరు. ఓపిక ఉంటే తెలియజేయండి. ప్రూఫ్ రీడింగ్ నేర్పినవారవుతారు.

9 వ్యాఖ్యలు:

rajendra devarapalli on December 2, 2007 at 9:50 AM   said...

మీ అభిప్రాయం కొంతవరకు నేను గ్రహించాను,అని అనుకుంటున్నాను.హస్యం రచనల్లోనే కాదు జీవితంలో కూడా తగ్గిపోతుందని మీలాంటి పెద్దలెందరో వాపోతున్నారు.సిమాలు,టీవి సీరియళ్ళలోని హస్యాన్ని కాసేపు పక్కకు పెడితే, దినపత్రికల దుగ్ధ అంటే అన్నీ మేమే ప్రచురించాలనేది,వార,మాస పత్రికలకు ఏమీ మిగల్చడంలేదు.దినపత్రికల లోకి ప్రవేశం సామాన్యులకు కష్టం. కొద్దోగొప్పో,హాస్యం రాయగలవారందరూ డైలీల్లోనే కనిపిస్తున్నారు.కొందరిది మీడియా హైప్ ఎక్కువ సరుకు తక్కువ,కాసేపు నిలకడగా వారి రచనలు చదివితే అర్ధమవుతోన్న సంగతదీ.
నేను ఈమధ్య బ్లాగు రాతలు మొదలు పెట్టాను.మీరు ఒక సారికొంచెం తీరిక చేసుకోని చూడగలిగితే అవి హాస్యం కోవలోకి వస్తాయేమో చెప్పగలరని నా కోరిక

te.thulika on December 8, 2007 at 4:30 AM   said...

మీవ్యాసం బావుందండీ. మీరుచెప్పినమాట నిజమే. కాని కథల్లో ఎక్కడా హ్స్యమే లేదనడం న్యాయం కాదు. మరొకవిషయం నాగరీకం పేరుతో మనకి మర్యాదలు ఎక్కువయిపోయేయి. ఎప్పుడేనా మేలమాడితే. మళ్లీ హాస్యానికి అన్నానండీ అంటూ చెప్పుకావాల్సివస్తోంది కూడా.
మీలాగే మంచి తెలుగుహాస్యం పునరుజ్జీవం గావాలనీ కోరుతూ ...
మాలతి

నువ్వుశెట్టి on December 28, 2007 at 7:49 AM   said...

గడచిన కాలపు మేధావులు, సామాన్యులు పండించిన హాస్యరసాన్ని ఈనాడు వెతకటం హాస్యాస్పదం. ఈనాడు హాస్యం అంటే బ్రహ్మానందం లాంటి వాళ్ళు చేసేదే అన్న భావన మిగిలిపోయింది. కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి దీనికి కూడా.

అచ్చుతప్పులు:-
మీరడిగారు కాబట్టి నేను కొన్ని ఏరాను, సమయం ఉంటే సరి చేయండి. (quotations లో ఉన్న వాటి జోలికి పోలేదు.)
౧.మొదటి లైనులో "హస్యం" ని హాస్యం గా మార్చండి
౨.6 లైనులో మళ్ళీ అదే తప్పు
౩. 7 లైనులో "గిరిశం" ని ’గిరీశం’ గా, "ఇవన్ని" ని ’ఇవన్నీ’ గా మార్చండి
౪. 8 లైనులో "ఇవన్ని", "లెక్ఖ"
౫. చిలకమర్రి అని ఉంది బహుశా చిలకమర్తి అనుకుంటాను
౬.10 లైనులో "ఇవన్ని"
౭. పద్యరచనలో కూడా చక్కని "హాస్య" ని "హాస్యం" గా మార్చండి.
౮.దబ్బాశ మూలంగా తన "కుమార్తే" ని "కుమార్తె" గా మార్చండి.
౯."వివాహముహుర్తం" ముహూర్తం
౧౦.హాస్యపాత్రలని "సృష్టిస్తున్నరే"
౧౧.హాస్యం అంటే "నిర్లక్షం" ని "నిర్లక్ష్యం" గా మార్చండి.
౧౨.వాటిని పెంచి హాస్యం"లొ" ని ’లో’ గా మార్చండి.
౧౩.అసమంజసమే"మి" ని ’మీ’ గా మార్చండి.
౧౪."వుర్రుతలూగిస్తుందే.." ని "ఉర్రూతలూగిస్తుందే.." గా, మరియు అదే లైనులో "నిర్లక్షం" ని ’నిర్లక్ష్యం" గా మార్చండి.

తప్పులు ఎవరి వ్రాతలో నయినా ఉంటాయి. నేను మీ తప్పులని ఎంచటం లేదని మనవిచేసుకుంటున్నాను.

నువ్వుశెట్టి on December 31, 2007 at 1:45 AM   said...

కష్టమే మిగిలినట్టుంది. ప్చ్..

netizen on December 31, 2007 at 1:51 AM   said...

@నువ్వుశెట్టి: అలక్ష్యం - నిర్లక్ష్యం కాదు. సమయం - తీరిక లేక. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలమ్ మీకు తప్పక అందుతుంది.

Karthik Pavan on January 1, 2008 at 2:44 AM   said...

నిజమేనండి.. మీరు చెప్పించి అక్షరాలా నిజం

డబ్బు సంపాదన వేటలో పడిన మనిషికి చివరిక్ మిగిలేవి అలసట ఒత్తిడి.. అది మీరైనా నేనైనా..

నవ్వరా బాబూ.. పేరుతో నేనూ నవ్వ్ గురించి ఓ టపా రాశాను.. మీ వ్యాఖ్యలను అందిస్తారని ఆశిస్తున్నా,,
http://karthikpavang.blogspot.com/2007/05/blog-post.html

netizen on January 1, 2008 at 3:39 AM   said...

@ నువ్వుశెట్టి: తమరు అన్యధా భావించకుండా, తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ బ్లాగులోని అప్పుతచ్చులని ఎత్తి చూపించినదుకు కృతజ్ఞతలు.

మీరు చూపించిన అచ్చుతప్పులన్ని దిద్దబడినవని అభిప్రాయము.

ఇక మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

నువ్వుశెట్టి on January 1, 2008 at 8:29 AM   said...

అమ్మయ్య. సమయం దొరికిందన్న మాట. మీకు కూడా నూతనవత్సర శుభాకాంక్షలు. నెటిజన్ గారు నేనేం మీ తప్పుల్ని ఎత్తి చూపలేదండి, వ్యాసం నాకు నచ్చటం మరియు వ్యాసం తరువాత మీరు మమ్మల్ని(పాఠకుల్ని) తప్పులుంటే తెలియజేయమని అభ్యర్దించటం వల్ల తెలియజేసాను. ఏది ఏమైనా అచ్చుతప్పులను మనం(బ్లాగర్లు) అంతగా పట్టించుకోక తేలికగా తీసుకోవటం మాత్రం నాకు బాధగా ఉంది.

netizen on January 1, 2008 at 9:24 PM   said...

@నువ్వుశెట్టి: మీరన్నది నిజమే! బహశ తెలుగు ఉపకరణాల వాడుకతో "పరిచయ"భాగ్యం మేమో!

ఈ బ్లాగులో తెలియజేసినట్లు, విహరిణిలలో సామ్కేతిక (సాంకేతిక)లోపాలు తెలియకకూడ కావచ్చు.

మాలతి (తె.తూలిక) గారు అన్నట్టు, "ఎప్పుడేనా మేలమాడితే. మళ్లీ హాస్యానికి అన్నానండీ అంటూ చెప్పుకావాల్సివస్తోంది కూడా".

"అప్పుతచ్చుల" విషయంలో! :)

Post a Comment