చీరేసుకుంటారా?

ఏవిటో మరీ చాదస్తం ఎక్కువైపోతోంది ఈ మధ్య?
ఒహటే, తెలుగు,తెలుగు,తెగులు,తెలుగు అని అరవ గోలని అరవగోల?
అలా అలోచిస్తుంటే, ఎక్కడో ఒక తెలుగు బ్లాగులో (ఆడువారు) వ్రాసిందేలెండి!
కనపడింది.
చదువుకుంటూ వెల్తుంటే, మధ్యలో గొంతులో ఏదో అడ్డం పడ్డ అనుభూతి.

+ + +

మనం తల దువ్వుకుంటాము.
బొట్టు పెట్టుకుంటాము.
కళ్ళకు కాటుక రాసుకుంటాం.
చెవులకు కమ్మలు పెట్టుకుంటాము.
ముక్కుకి పుడక తగిలించుకుంటాము.
మెడకి గొలుసు వేసుకుంటాం.
చేతులకి గాజులేసుకుంటాం.
రవిక కట్టుకుంటాము.
లంగా కట్టుకుంటాము.
చీర వేసుకుంటామా లేక కట్టుకుంటామా?
+ + +

అదండి, అనుమానం! నివృత్తి చెయ్యరూ! ఎదో ఒహటి, కట్టుకోవడమో, వేసుకోవడమో!
ఒహటే సణుగుడని, సణుగుడు.
చీర కట్టుకునో, వెసుకునో వస్తారుగా, లంగా జాకెట్టుతో అలా రోడ్డు మీదకు రారుగా ఆ కేరళ వాళ్ళ లాగ అంటారా?
ఐనా మరీ చోద్యం కాకపోతే, ఇంకా లంగా, చీర, జాకెట్టు ఎక్కడవండీ!
చక్కగా ఆ చురీదారు తగిలించుకోక?
ఓహో, కట్టుకోవడం,వేసుకోవడం ఐపోయిందా, ఇప్పుడు తగిలించుకోవడం వచ్చిందా?
ప్చ్!
ఏవిటో, మరీ చాదస్తం ఎక్కువైపోతున్నది, వయసొస్తున్నకొద్ది!

31 వ్యాఖ్యలు:

సుజాత on August 30, 2008 at 6:41 AM   said...

చీర కట్టుకోవడం తల్లులే పండక్కో పబ్బానికో చేస్తుంటే(భుజాలు తడుముకుంటున్నా), పిల్లలకు చీర కట్టుకోవాలో, వేసుకోవాలో ఎలా తెలుస్తుందండి?

కాలేజీలో ఏదన్నా పార్టీయో ఏదో జరిగితే ramp show జరగటం ఇవాల్టి ఆచారం. అందులో వివిధ రాష్ట్రాల సంస్కృతిని (ఆంధ్రా తప్పించి)ప్రతిబింబిస్తూ చీరెలు "వేసుకుని" నడవటం ఈ తరం యువతుల హాబీ!

జన్మానికొక్క రోజేగా, వేసుకుంటేనేం, కట్టుకుంటేనేం?

జ్యోతి on August 30, 2008 at 6:45 AM   said...

ఇప్పుడీ డౌట్ మీకెందుకు వచ్చింది?? హాయిగా తిని , బ్లాగులు చదివి తొంగోక. ఇవన్నీ పట్టించుకోవడమే పెద్ద చాదస్తం..:)

sujata on August 30, 2008 at 8:47 AM   said...

నయం ! చీరలు చుట్టుకోవట్లేదెందుకని అని అడగలేదు ! నేనైతే, వేసుకుంటా... ధరిస్తా ! (ధరిస్తే !) అయినా ఏదో ఒకటి ధరించడం జరుగుతున్నంత వరకూ మానవాళికి ప్రమాదం ఏమీ లేదు ! [తెలుగు విషయం పక్కన పెడితే ! ]

cbrao on August 30, 2008 at 12:15 PM   said...

చీరను కొందరు కట్టుకుంటారు అందంగా - ఉదాహరణకు రాధా మధు సీరియల్ ( మా టీవి) లో మధు చీర కట్టుకునే తీరు. నాకు తెలిసిన మరి కొందరు చీర వేసుకోరు -చుట్టుకుంటారు. చీరలు ధరించిన వారిని నేను చూడలేదు.

netizen నెటిజన్ on August 30, 2008 at 8:32 PM   said...

@ సుజాత, జ్యోతి, Sujata: బహుశ ఈ అలసత్వమే మన భాష క్షీణించడానికి కారణమేమో, ఆలోచించండి!

@cbrao: సాధరణంగా విదేశీ స్త్రీలు మన చీరకట్టుకునేటప్పుడు ఈ "చుట్టుకోవడం" కనబడుతుంది. అలా అని మన తెలుగు మహిళామణులు చుట్టుకోరని కాదు.

Falling Angel on August 31, 2008 at 12:58 AM   said...

నేను ఉద్యోగంలో చేరిన మొదటిమూడునెలలు కార్పొరేట్ ట్రైనింగ్, అప్పుడు వారానికొకరోజు ఫార్మల్స్ తప్పనిసరి. షర్ట్, ప్యాంట్ వేస్కోవడం ఇష్టంలేని అమ్మాయిలకి చీరకట్టుకోవచ్చన్న వెసులుబాటుండేది. పాపం వాళ్ళకి అదికూడా కట్టుకోవడం రాక చుట్టుకుని వచ్చేవారు. ఓ అమ్మాయిలూ, చీరకట్టుకోవడమైనా నేర్చుకోండి, లేకపోతే మిగతారకాల ఫార్మల్స్ ట్రై చెయ్యండి అని చెప్పాలనిపించేదిగానీ, కొడతారేమో అని ఆగిపోయా :)

భైరవభట్ల కామేశ్వర రావు on August 31, 2008 at 2:49 AM   said...

చుట్టూ చెంగావి చీర "కట్టాలే" చిలకమ్మా అనేసరికి చెంగావి రంగు చీర "కట్టుకున్న" చిన్నదాన్ని మీరు చూసే ఉంటారు.
చీర "కట్టీ" సింగారించీ, జ్యోతిలక్ష్మి చీర "కట్టింది". అప్పుడా చీరకే సిగ్గేసిందిట కదా!
మరెవరో తన శ్రీమతిని తెల్లచీర "కట్టుకున్న"దెవరికోసమో అని అడుగుతున్నాడు, అదేం చోద్యమో?
అందుకే కాబోలు మనకి "కట్టు"బాట్లెక్కువంటారు. అయినా ఈ రోజుల్లో చాలామంది చుడీ"ధారులే" కదా :-)

శరత్ on August 31, 2008 at 7:17 AM   said...

స్త్రీలు మాత్రం చీరలు కట్టాలి. మగాళ్ళూ మాత్రం ఎంచక్కా పంచెలు వదిలేసి ప్యాంటులు వేసుకుంటారు.

netizen నెటిజన్ on August 31, 2008 at 9:57 AM   said...

@Falling Angel:"కొడతారేమో అని ఆగిపోయా" అని మీరు హస్యానికి అన్నా, మీరు ఆ రోజే కాదు, ఏ రోజు ఆగిపోకూడదు.

కట్టుకోవడం మూలంగా మన సంస్కృతి పది మందికి తెలుస్తుంది. తెలియని వాళ్ళకి తెలియజెప్పినవారమవుతాం. భాష మన సంస్కృతి లో ఒక భాగమే! అందుకే తల్లి, తన భాషని కాపాడుకుంటూ, పిల్లలకు అందజేస్తే అది ఇంకో పది కాలలబాటు బతుకుతుంది.

@ భైరవభట్ల కామేశ్వర రావు గారు:"బొడ్డు కింద చీరకట్టు మోజులాయే" అని రఫీ ఎప్పుడో, "భలే తమ్ముడు"లో పాడాడు.

ఇక్కడ వస్త్ర ధారణ గురించి కాదు చెప్పదలుచుకున్నది. స్త్రీ, ఒక తల్లిగా తన భాషని పిల్లలకి సక్రమంగా అంద జేస్తే, మనం ఈ రోజు మన భాష చచ్చిపోతున్నది అని బాధ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అలాగే రేపటి తరాలు తమ "తెలుగు తనం" గుర్తుంచుకోవడానికి అవకాశం పెంపొందించే వారవుతారు కదా!

@శరత్: తండ్రులుగా మగవారు కూడా, తమ పిల్లల జీవితంలో వృత్తి, వ్యాపారాలకోసం ఏదో భాషని పిల్లలు నేర్చుకుని తమ జీవనాన్నీ సాఫీగా నడుపుకోవడానికి దిశానిర్దేసం చేసినా, "తెలుగు" ని కూడా నేర్చుకోవడాన్ని ప్రోత్సాహించాలి.

మగాళ్ళూ పాంట్లు వేసుకోరేమో, తొడుగుతారేమో?

రాధిక on August 31, 2008 at 12:24 PM   said...

ఒహొ..అయితే మీరు రోజూ పంచె కట్టుకుంటున్నారన్న మాట మన సంస్కృతిని బతికించడానికి.
BTW నాకు చీర అందంగా కట్టుకోవడం రాదు.

netizen నెటిజన్ on August 31, 2008 at 9:31 PM   said...

@రాధిక: లేదు. చీరకట్టు గురించి కాదు ఈ టపా. అసలు విషయం అది కాదు. భాష. భాషని మనం సరిగ్గా వాడుకోక పోతే అది తుప్పు పట్టి పాడైపోతుంది. భావ వ్యక్తీకరణ అసంపూర్తిగానో, లోపభూయిష్టంగానో జరుగుతుంది. అపోహలూ, అభిప్రాయభేదాలు తలెత్తుతవి. ఈ పొరబాట్లాని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోకుండా , అవే మన పిల్లలకి అందించడం ద్వారా మనం ఇంకొక పెద్ద తప్పు చేసినవారమవుతాం.

కత్తి మహేష్ కుమార్ on September 1, 2008 at 1:14 AM   said...

భాషా సంస్కృతీ రెండూ విడదీయలేనివి. సంస్కృతిలో లేమి భాష మీద వుండటం చాలా సహజం, స్వాభావికంకూడా. ఒక ఉదాహరణతో మంచి లోతైన విషయంపైన చర్చ లేవదీసారు.

విరజాజి on September 2, 2008 at 8:32 AM   said...

మా అమ్మాయికి చీర కట్టుకోవటం రాదండీ అని చెప్పే తల్లులతో పాటు... కనీసం పెళ్లి లో అయినా పంచె కట్టుకోని పెళ్లి కొడుకులూ ఉన్నారండీ. నా మటుకు నాకు మన సాంప్రదాయ దుస్తులలో ఉండే అందం మరే దుస్తుల లోనూ కనపడదు. తల్లిదండ్రులు సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటే తెలియకుండా అవే పిల్లలకి అలవాటు అవుతాయి. నేను కాలేజీ కి పావడా పమిట వేసుకొని వెళ్తున్నప్పుడు చాలా మంది పల్లెటూరి పిల్ల అని పేరు పెట్టారు... అలా ఆన్నవారి కన్నా నేను చా.....లా రెట్లు ఎక్కువగా చదువుకున్నాను. అందరికన్నా మంచి ఉద్యోగం చేస్తున్నాను. ఆధునికత అనేది దుస్తులలో చూపడం కాదు!!... మన పిల్లలకి మన సంస్కృతిని గౌరవించడం మనమే నేర్పాలి. ఆడవాళ్ళు ఇంకా చాలా విషయాలను విస్మరించకుండా ఉన్నారు కనుకనే కనీసం ఈ మాత్రం అయినా మన సాంప్రదాయాలు, సంస్కృతి బతికి ఉన్నాయి...!! అన్నట్లు నేను కూడా చుడీ "ధారి" నే... అది కూడా మన భారతీయ వస్త్ర శైలి కదా... !! చీర నాటికీ, నేటికీ, మరెన్నటికీ వన్నె తరగని, ముద్ర చెరగని నిత్య నూతన వస్త్ర ధారణ... !! కనీసం మన పండుగలు, పూజలకైన సాంప్రదాయ దుస్తులు ధరించాలని అందరూ అనుకుంటే ... మన పిల్లలకి ప్రత్యేకంగా పంచెలు (పంచెలంటే అడ్డ పంచెలు కావండోయ్.... పూర్తిగా మన తెలుగు పంచె కట్టు ), చీరలు కట్టుకోవడం నేర్పించక్కరలేదు. ...!! అలాగే ఇంట్లో పూర్తిగా తెలుగు లోనే మాట్లాడితే... పిల్లలకి ప్రత్యేకం గా తెలుగు లో శిక్షణ అవసరం లేదు.....!! ఏవంటారు...!!

netizen నెటిజన్ on September 2, 2008 at 10:04 AM   said...

@కత్తి మహేష్ కుమార్: ఒకానొక నాయకుడైతే అసలు ఈ తల్లి నా తల్లి కానేకాదు అని అన్నాడు! అటువంటి వారితో పేచి ఏమి ఉండదు, మహేష్ గారు.

ఈ బ్లాగ్ ప్రపంచలో బ్లాగే చాలమంది, కేవలం తెలుగు మీద అభిమానంతో నే బ్లాగుతున్నరన్నది సత్య దూరం కాదు.

కాని, ఈ బ్లాగర్ అలవోకగా, అనాయసంగా, అలోచనరహితంగా భాషని అవమానించడం క్షమార్హం కాదు, అందులో తెలుగు భాష మీద చాల మక్కువ, ప్రేమ, అభిమానం,ఆ భాషకి సంబంధించిన కళల (ఉదా: సాహిత్యం, ..)మీద కూడ అంత కాకపోయినా అంతకంటే తక్కువ కాకుండా ఇష్టాన్ని, అనురక్తిని,అనురాగాన్ని,మమకారాన్ని ప్రదర్శిస్తూనా..

@విరజాజి గారు ఇంకేమంటామండి? నిజమే. మీరన్న తెలుగు పంచెకట్టు మీద గతంలోనే లోకేష్ వివాహ సమయంలో ఒక టపాలో ప్రస్తావించడం జరిగింది. తెలుగు యువకులు కూడ, కనీసం శుభకార్యాలలో ఐనా దానిని వాడుకలోకి తెచ్చి తగిన ప్రచారాన్ని కలిపిస్తే చాలా బాగుంటుంది, అందులో అనుమానం ఏమున్నది.

సుజాత on September 2, 2008 at 10:52 PM   said...

'చీర వేసుకోవడం" అనే మాట కరెక్టా కాదా అనే విషయం వదిలేసి అందరూ చీర కట్టు సంస్కృతి గురించి మాట్లాడుతున్నారేమిటి?

ఈ తరం తెలుగు పిల్లలు చాలా మంది 'చీర వేసుకోవడం" అనే వాడుతున్నారు. ఏం చేస్తాం? వినలేకపోతే చెవులు మూసుకోవడం తప్ప వాళ్ల భాషను సంస్కరించే బాధ్యత నెత్తిన వేసుకోకూడదు. దానికి సాహసిస్తే, మనకొచ్చిన కొద్దో గొప్పో తెలుగు కూడా చెట్టెక్కుతుంది!

netizen నెటిజన్ on September 2, 2008 at 11:40 PM   said...

సుజాత గారు, అలా ఊరుకోవాల్సిన అవసరం లేదండి. మన తెలుగుని కాపాడుకుంటూ, దాని అర్ధాన్ని వారికి విడమరిచి చెప్పాలండి. మీ తల్లి, తండ్రి మీకు దానిని గురించి చెప్పారు. అందుకనే మీరు భాష మీద ప్రేమతో, తెలుగులో బ్లాగు తున్నారు, ఆంగ్లంలో బ్లాగగలిగినా కూడా. మీరే ఇలా అంటే ఎలాండి? మీ తెలుగును మీరు చెట్టెక్కించారా? లేదు కదా? మరి ఈ నిరాశ(?) ఎందుకు? మీ తెలుగుని మీరు కాపాడుకుంటునే, పిల్లలకి చెప్పొచ్చు కదా!అందరూ అలానే అనుకుంటే ఎలాగండి!

ప్రవీణ్ గార్లపాటి on September 3, 2008 at 8:15 AM   said...

మీ ఈ టపాకి ప్రేరణ నాకు తెలుసు. ఆ టపా చదివినప్పుడు నాకూ అలానే అనిపించింది.
అయినా సరే మీరు వారి బ్లాగులో చెప్పి ఉంటే బాగుండేది.

తప్పులు అందరమూ చేస్తాం కదా. సరిదిద్దితే బాగుంటుంది.

బొల్లోజు బాబా on September 3, 2008 at 11:20 AM   said...

మొత్తం మీద అందరూ కలసi చీరకట్టు మీద చీల్చి చెండాడేసారు.
బాగు బాగు
బొల్లోజు బాబా

Anonymous on September 4, 2008 at 7:08 AM   said...

@ప్రవీణ్ గార్లపాటి: సదరు టపాలో అభిప్రాయాన్ని వెల్లడిస్తే అభిప్రాయబేధాలతో, అపోహలు కలుగుతయ్యేమో అన్న అనుమానంతో, దాని మీద వీలైనంత వివరంగా ఒక టపా రాసి చర్చిస్తే పదిమంది తమ అభిప్రాయలనూ పంచుకోవచ్చన్నది నెటిజన్ అభిప్రాయం.

టపా వెలువడిన మూడు, నాలుగు రోజుల తరువాత కూడ దీని మీద వ్యాఖ్యానాలు రావడం మీరు గమనించాలి.

తప్పులు ఒఖ్హరే చెయ్యడంలేదన్నది ఇక్కడి వ్యాఖ్యలు చదివితే తెలుస్తుంది. ఇంత మంది, మీ మాటల్లోనే "సరి" దిద్దుతున్నారు కదా, తమదైన శైలిలో, మీతో సహా! :)

Anonymous on September 4, 2008 at 10:17 PM   said...

@బొల్లోజు బాబాగారు, చీరకట్టుని చీల్చి చెండాడ లేదండి! బాధ్యతగల ఒక తెలుగు బ్లాగరు గా భాషలో అనుచితంగా పదాలను వాడేటప్ప్పుడు ఏర్పడే ఇబ్బందుల గురించి వాటి పరిణామాల గురించి ఒక చిన్న చర్చ జరుగుతున్నది.
చీరకట్టుకోవడం, వేసుకోవడం - ఇక "వారి" ఇష్టం.
తెలుగు భాష మీద అవాజ్యమైన ప్రేమనే "చీరేసుకుని", తైతక్కలాడుతుంటే చూసే వారు, "అందరు" ఊరుకోరు, "కొందరు" ఊరుకోవచ్చేమో కాని.
తెలియనివారు, "చీరేసుకోవడమే" పద్ధతి అనుకుని దానిని అనుకరిస్తే ఇంకా ప్రమాదం. "చీరేసుకుని ", బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు, "బొడ్డు" కిందుగా ఆ చీర జారితే ..అసలు ఊహలోకి కూడా రాకుడని అసహ్యమైన ఆలోచన అది. దానిని నివారించాలని ఈ చర్చండి, బాబా గారు.
మరి మీరేమంటారు?

Anonymous on September 5, 2008 at 1:44 AM   said...

నెటిజెన్: మీ చివరి వ్యాఖ్యలోని చివరి పేరా అసలు విషయం నుండి దూరంగా జరిగిపోయి ఎక్కడికో జారిపోయింది. మూలంలో మీరెత్తి చూపిన లోపానికి ఇది అనవసరమైన, అవాంఛనీయమైన సాగతీత అనిపిస్తోంది.

సుజాత on September 5, 2008 at 6:51 AM   said...

నెటిజెన్,

నిస్పృహతో అలా అన్నానండీ! కానీ నేను గర్వంగా చెప్పుకోగలిగిన విషయం మా అయిదేళ్ల పాప అద్భుతమైన తెలుగు మాట్లాడుతుంది.
"నీ అభిప్రాయం ఏమిటి చెప్పు"
'నా విషయం కూడా ఆలోచించు"
"నేను ఊహించలేకపోయాను" వంటి వాక్యాలు సొంతగా వాడుతుంది.
ఇంట్లో నేను తెలుగు నేర్పుదామనే ఉద్దేశంతో స్కూల్లో హింది ఇప్పిస్తే, నాకు చెప్పకుండానే "నేను తెలుగు క్లాసులో కూచుంటాను" అని టీచరు తో చెప్పి తనే తెలుగు క్లాసుకు వెళ్లడం మొదలెట్టింది. ఈ విషయంలో మాత్రం అలసత్వం లేదు నాకు!

ఇక నా తెలుగు సంగతి అంటారా? హైదరాబాదు వచ్చాక ఇక్కడి విద్యార్థులు ఎవరైనా కనపడితే "ఎగ్జాం ఎప్పుడు ఇస్తున్నావు"అని అడిగే స్థాయిలో ఉంది పరిస్థితి!(మొదట్లో ఎగ్జాం "ఇవ్వడం" ఏమిటో అర్థం కాక పిచ్చి ఎక్కింది)

netizen నెటిజన్ on September 5, 2008 at 7:04 PM   said...

@చదువరి: జారిపోలేదు,చదువరి. కాని హద్దుల ఆవలి అంచుదాకా వెళ్ళింది. నెటిజన్ తన హద్దులను అతిక్రమించే పరిస్థితి ఎప్పటికి రాదు. నెటిజన్‌కి హద్దులు చూపిస్తూ జాగ్రత్త అని వారిస్తున్న మీకు కృతజ్ఞతలు.

netizen నెటిజన్ on September 5, 2008 at 7:24 PM   said...

సుజాత, నిస్పృహ ఎందుకండి? పైగా అంత చక్కటి తెలుగు మాట్లాడుతున్న పాపని పెట్టుకుని.మీ పాప తెలుగులో ఆలోచిస్తున్నన్నది మీరు గమనించారా?

మీ పాప పేరు?
బుగ్గలు పుణికి, ఎత్తుకుని, ముద్దులతో ముంచెత్తాలనిపిస్తున్నది, మీ పాపని. మీ పాపకి తెలుగుని ఎవరు నేర్పారు, ఎవరు నేర్పుతున్నారు?

పిల్లలు ఇంట్లో పెద్దవారిని అనుకరిస్తారు. వారికి తగిన వాతావరణం కల్పించాలి. మనం నేర్పదలుచుకున్న విలువల్ని మనం వారికి అర్ధం అయ్యే రీతిలో వారి ముందు ప్రవర్తించి, పాటించి, చూపించాలి. వారు దానిని గమనించాలి. గుర్తించాలి. ఇదే తగిన వయసు. బహుశ ఇంకొక రెండేళ్ళు. తరువాత బయట ప్రపంచం చూసి వారికి అర్ధం కానివి మనల్ని అడిగినప్పుడు, ఓపికగా, విసుక్కోకుండా, నెమ్మదిగా, వారికి విడమరిచి చెప్పాలి. అర్ధం కాకపోతే ఒకటికి వంద సార్లు, అదేపనిగా కాకుండా, అవకాశం వచ్చినఫ్ఫుడల్లా చెబుతూఉంటే, రేపు మీరు ఇంకా గర్వపడే విధంగా ఎదుగుతారు.
మీ పాప పేరు చెప్పండి, మరిచి పోకండి!
ఎంత సంతోషంగా ఉందో!

Purnima on September 5, 2008 at 9:21 PM   said...

సుజాత గారు: ఐదేళ్ళ పాప "అభిప్రాయం" లాంటి పదాలు వాడగలుగుతుందంటే మీ ఇంటిలోని తెలుగు వాతావరణం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అభినందనలు!

Anonymous on September 6, 2008 at 1:00 AM   said...

నెటిజెన్: మిమ్మల్ని జాగ్రత్త అని హెచ్చరించడం నా ఉద్దేశ్యం కాదు. అలా ధ్వనిస్తే, మన్నించండి.

సుజాత on September 6, 2008 at 5:45 AM   said...

నెటిజెన్,
మా అమ్మాయి పేరు సంకీర్తన!
ఆమెకు తెలుగు నేనే నేర్పాలని మొదలెట్టాను. ఈ లోపు స్కూల్లో కూడా అది తెలుగునే ఎంచుకుంది సొంతంగా! శుద్ధ వ్యావహారికంలో ఉండే పిల్లల కథా సంకలనాలు తన కోసం కొంటాను. వాటిలోంచి కథలు చెప్పటం కాక, దగ్గర కూచోబెట్టుకుని చదివి వినిపిస్తాను. బహుశా 'ఆలోచించడం ' 'ఊహించడం ' వంటి పదాలు వాడటానికి ఇదే కారణం కావొచ్చు! పంచతంత్రం కూడా సహవాసి గారు రాసిందే ఉంది నా దగ్గర!

దాని వల్ల త్వరగా తెలుగు చదవడం వస్తే తనూ స్వంతగా పుస్తకాలు చదవొచ్చు అనే ఊహ ఏర్పడింది తనలో! నా లైబ్రరీ అంతా చదివేయాలని కోరిక!

ఇంతే కాక, సంస్కృత శ్లోకాలు కూడా స్పష్టంగా, తప్పులు లేకుండా చదవగలదు. గీతా శ్లోకాలు కూడా స్పష్టంగా పఠిస్తుంది.

ఎంత చెప్పానో చూడండి? పుత్రికోత్సాహం అంటే ఇదేనేమో!

netizen నెటిజన్ on September 6, 2008 at 8:12 PM   said...

ఓ చదువరి, మీ మాటలు, అలా ధ్వనించలేదు; కాబట్టి మన్నింపు ప్రశ్న ఉదయించదు! > మన్నింపు ఊసే లేదు:)

మీ అంత అప్రమత్తంగా ఎంత మంది ఉన్నారన్నది ఆలోచించాల్సిన విషయం!

తెలుగు బ్లాగ్ ప్రపంచం, జాలంలో ఒక నీటి బొట్టు! మహా ఐతే, ఒక గుంపు (గ్రూప్). ఆ సమూహానికి ఒక ప్రవర్తనా నీయమ నిబంధనలని క్రోడికరించడానికి ప్రయత్నం జరుగున్నది.

ఈ సమూహంలోని టపాలను వెలువరిస్తున్న బ్లాగరిని కాని, వారి టపాలను,అవి వెలువరించే భావజాలాన్ని కాని నియంత్రించాలనుకోవడం ఒక వ్యర్ధ ప్రయత్నం.

మహా ఐతే ఒక బ్లాగ్ సంకలిని (బ్లాగ్ అగ్రిగేటర్‌)లో అటువంటి టపాలు కనపడకుండా చేయవచ్చు. ఇటీవల అటువంటి ప్రయత్నాలు జరిగినవి. జరుగుతున్నవి. రేపు మరొక సంకలిని రాక మానదు. నియత్రించబడ్డ, నిషేదించబడ్డ బ్లాగులు అక్కడ కనబడకా తప్పదు. చదివించే గుణం వున్నవాటిని చదువరులు చదవక మానరు.

పిల్లలు పరిగెడుతుంటే చూస్తు ఇతరులు చూస్తు ఊరుకోరు. వారికి హితవు చెబుతారు. విన్నవారు వింటారు. ఒక జీవిత కాలం క్షేమంగా ఉంటారు.

పడి దెబ్బలు తిన్నవారిని, ఓదార్చి, వారిని కార్యోన్ముఖులను చేస్తే వారి వల్ల సమాజం మరింత లాభిస్తుంది.

బ్లాగులలోని భాషకూడా అంతే! తెలిసిన వారు, తెలియని వారికి తెలియజెప్పడంలో తప్పులేదు. తన ఉనికిని, తన బాధ్యతనెరిగిన బ్లాగరి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందని ఊహించజాలము.

ఒక తల్లిగా స్త్రీని చూసినప్పుడు,తండ్రితో పాటు, ఆ మాతృమూర్తికూడ తన పిల్లల విద్యాబోధనలు నేర్పే బాధ్యత పంచుకోవలసి ఉంటుంది. ఆ లాంటి స్త్రీ తన బిడ్డలకు కూడా, తెలిసో తెలియకో,అవే విలువలని నేర్పినప్పుడు, వాటి పరిమాణాలు ఎలాఉంటాయో, ఈ సమాజం నిత్యం అనుభవంలోకి తెస్తునే ఉన్నది.

భాష జీవనది. ప్రజలు నిర్దేశించినట్టు అది ప్రవహిస్తుంది. మార్పు సహజం. నిత్యం.

టపాల వ్యాఖ్యలలో చెప్పనట్టు: "చీరకట్టుకోవడం, వేసుకోవడం - ఇక "వారి" ఇష్టం."
మన పిల్లలకి మనం ఏది నేర్పాలి!
కాబట్టి, "చీరేసుకోవడం" టపా

Falling Angel on September 7, 2008 at 2:08 AM   said...

సుజాతగారూ, మీ పాప పేరు సూపర్. ఈమధ్య కాస్త ముద్దుగా ఉన్న పిల్ల పేర్లు అడుగుడామంటేనే భయమేస్తోంది. మొన్న మా ఊరెళ్తుంటే ట్రైన్లో ఒకావిడ తగిలింది, వాళ్ళ ఏడాది వయసున్న పాప పేరు ఏమిటని అడిగితే "శ్రీక" అని చెప్పింది. భళ్ళుమని నవ్వబోయి తమాయించుకున్నాను, ఇంటికెళ్ళి డిక్షనరీ చూసి అప్పుడు నవ్వుదాం అని. నాకైతే కనబడలేదు, బూదరాజు రాధాకృష్ణగారి పురాతన నామకోశం కూడా తిరగేశాను ఏమైనా పురాణపాత్ర పేరేమో అని, ఊహు.

Anonymous on September 7, 2008 at 8:26 AM   said...

సంకీర్తనకి నా ఆశిస్సులు.
చాలా సంతోషం.
తప్పకుండా తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉంచండి!
తెలుగుమీద అభిమానాన్ని పెంచేందుకు అవి దోహదపడుతాయి.
పుత్రికోత్సాహం అంటే ఇదే.:)

netizen నెటిజన్ on September 7, 2008 at 8:35 AM   said...

@Falling Angel: నిజమే! పురాణాలు, ఇతిహాసాలు చదివి పేర్లుపెడుతున్న తల్లితండ్రులున్నారు.ప్రణవాత్నిక, లలితసమన్విత ఎంత క్లిష్టమైన పేర్లు. పిల్లలు వాటిని పలుకలేరు. ఏదో ఉచ్చరిస్తారు. వింటున్న వారికి చిరాకేస్తుంది. పిల్లలు ఆ చిరాకుని గ్రహిస్తారు. ఇక ఆక్కడి నుండి బయలుదేరుతుంది అసహనత. వారి జీవితకాలం వారిని అది వెన్నంటి వేటాడుతునే ఉంటుంది.

Post a Comment