సిగ్గు

విశాఖజిల్లాలోని, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతలలో సుమారు మూడువేల ఎకరాలలో బాక్సైట్ తవ్వి, శుద్ధిచేసి, ఎగుమతిచేసి, ఆ వచ్చే రాబడితో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో మరొ అడుగు ముందుకు తీసుకువెళ్ళాలని, మరో మెట్టు పైకెక్కించాలని ప్రస్తుత ప్రభుత్వ ఆశయం.  కాని దానికి ఆ ప్రాతంలోని గిరిజనులు, పేద, అల్పాదాయవర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు.  ప్రతిపక్షం కూడా దానికి తన గళాన్నిస్తున్నది.  ప్రజల శ్రేయస్సే తమ ఉన్నతాశయంగా ఎంచుకున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోసం, చింతపల్లిలోని కాఫీ శుద్ది కర్మాగారంలో  "ప్రజాభిప్రాయ సేకరణ" చేబట్టింది.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ముఖ్యమంత్రి తనయుడు, జగన్ సారధ్యంలో, జగతి పబ్లికేషన్స్ - ప్రచురిస్తున్న "సాక్షి" దిన పత్రికలో నిన్న జరిగిన "బాక్సైట్' పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ గురించి - "అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎవరూ ముందుకు రాలేదు", అనీ, దాంతో, " ఎటువంటి ప్రకటన చేయకుండానే అధికారులు వేదిక దిగి వెళ్ళిపోయారు," అని వార్త.

టీ.వి లన్ని చూపించినవి, విశాలమైన ప్రదేశంలో ఖాళీ కుర్చీలు.  వేదికకు ఎదురుగా , మొదటి వరసలో కుడి చేతివైపు ఖాళీ కుర్చీలలో  బిక్కు బిక్కు మంటూ, ఒక ముగ్గురో నలుగురో మనుషులు.

బహుశ, ప్రజలందరూ కూడ తమ అభిప్రాయాన్ని, వేదిక వెనక్కెళ్ళి, ఆ మరుగున చూపించి ఉంటారు.  ఎంతైనా మనుషులు కదా, బహీ:ప్రదేశంలో చూపించలేరుగా, అందులోను ప్రసారమాధ్యమాలముందు.  వారికి ఉండదా సిగ్గు?