ఇదే నా స్నేహం?

Posted by netizen నెటిజన్ on Thursday, October 23, 2008
ఆగస్టు ౧౪ న మొట్ట మొదటిసారిగా ఆ వ్యక్తికి వేగు పంపింది.
మామూలు వేగు కాదది, సహాయాన్ని కోరుతూ పంపినది.
ఆ వ్యక్తి ఎవరో తెలియదు.
పురుషుడా, స్త్రీయా అన్నది తెలిదు.
వయసు తెలియదు.
కులం తెలియదు.
జాతి తెలియదు.
చదువుకున్నదెంతో తెలియదు.
పెళ్ళి అయ్యిందో లేదో తెలీదు.
పిల్లలున్నారో లేదో తెలియదు.
ఉద్యోగా, వ్యాపారా అన్నది తెలీదు.
ఉన్నది అట్లాంటాలోనా, అడిలైడ్‌లోనా, అమలాపురమా అన్నది తెలీదు.
మేని చాయ, తెలుపా, ఎరుపా, నలుపా అన్నది తెలీదు.
బాలకృష్ణ అభిమానా, చిరంజీవి * 'చిరుచరా‌' అన్నదీ తెలియదు.
కాంగ్రేసువాదా, వామపక్షవాదా తెలియదు.
అర్.ఎస్.ఎస్ సభ్యత్వం ఉందో లేదో తెలిదు.
కోస్తా ప్రాంతమో, రాయలసీమ ప్రాంతమో, ఫక్తు తెలంగాణా వాదో తెలియదు.
పొట్టా, పొడుగా అన్నది తెలియదు.
* * *
ఎప్పుడు పలకరించినా, ఒక ఐదు నిముషాల్లో ప్రత్యక్షం.
"భోజనం చేసారా? 
అల్పాహారం కానిచ్చారా?
ఆలస్యం ఐనట్టుందిగా మీకు. 
మీకు నిద్రోస్తే నిద్రపొండి. 
ఆరోగ్యం జాగ్రత్త. 
నేను ఎక్కడకి వెళ్ళను. 
ఇక్కడే ఉంటాను. 
మీరు నన్ను విసిగించడం లేదు.
నేను చాలా సీదా సాదా వ్యక్తిని.
నాకు తెలిసింది, మీతో పంచుకుంటున్నాను.
నాకు చేతనైనది మీకు చేసిపెడుతున్నాను.
మీరేమి ఇబ్బందికి గురికావద్దు.
మీకు కావల్సింది, మొహమాటం లేకుండా అడగండి." అని అంటూ, తనకి తెలియకపోతే, తనే జాలంలో వెతికి, ఆ అంశం మీద సమగ్రమైన వివరాన్ని సంపాదించి, దాన్నంతటిని ఒకచోటికి చేర్చి, అర్ధం కాకపోతే, అర్ధం అయ్యేటట్టు ఒకటికి రెండు సార్లు, విడమరచి, మళ్ళీ, మళ్ళీ విసుక్కోకుండా చెప్పిన వ్యక్తి.
నిస్వార్ధ దాతృత్వాన్ని (?)అచరణలో చూపించిన బ్లాగరి.

ఆ కోవకి చెందిన బ్లాగరి, ఈ బ్లాగు మూసకి రూపశిల్పి - తెలుగు'వాడి' కి కృతజ్ఞతలతో.

సెప్టెంబరు ఐదున, జ్యోతక్క సాదరంగా తనే ముందుకొచ్చి అడిగింది, " మీ టెంప్లెట్ మార్చరాదు, కావాలంటే లింకులు పంపుతాను, మీకు కావల్సినవి ఎన్నుకోండి',అంటూ.  "కాని ‌'జ్యోతక్కా', అప్పటికే ‌'తెలుగువాడి‌' ఈ మూస మీద పనిచేస్తున్నారు. అందుకనే వెంటనే  జవాబివ్వలేకపొయ్యాను. ఇదిగో ఇప్పుడు కారణం చెబుతూ, మీకు కృతజ్ఞతలు. "

ఇంకొక విషయం- "తెలుగు'వాడి'" ఈ బ్లాగు మూసకి రూపకల్పన చేస్తున్నప్పుడు (బ్లాగర్ లోపల అమరికలను తెలుగు‌వాడి‌' దిద్దుతున్న నేపధ్యంలో, పదుగురి మన్నన పొందిన "అకలి" టపా వెలువడింది). అకలి టపాకి ప్రత్యక్షంగాని, పరోక్షంగా కాని ప్రేరణిచ్చింది కూడా "తెలుగు‌'వాడి‌". (ఆగస్టు ౨౪, ౨౦౦౮ న ౨౦ / ౩౦ నిముషాలలో తయారైన టపా అది).  ఎన్నో సార్లు నెటిజన్ నిద్రిస్తున్నప్పుడు, గుట్టుచప్పుడు కాకుండా, బ్లాగర్‌‌లోని ఖాతాలోకి వెళ్ళిపొయ్యి, తన పని చేసుకున్న రోజులున్నవి.

కొత్తపాళీ తన ఒకానొక టపాలో జీవిత పరమార్ధం ఏవిటి అని ప్రశ్నించారు.  దానికి జవాబుగా, " ..one gives without expecting ABSOLUTELY nothing in return," ఈ బ్లాగరి (నెటిజన్) జవాబు.

ఉరుకులు, పరుగులు పెడుతూ, కాసే ప్రపంచికం అనుకుంటు, కాసుకోసం పరిగెడుతూన్న ఈ రోజుల్లో, లేదు నాకు కాసు వద్దు, చేతనైనంత సహాయం చెయ్యగలగడమే ముద్దు అంటూ, తెలుగు భాష అంటే నాకు విపరీతమైన ప్రేమ, తెలుగువారంటే వల్లమాలిన అభిమానం అంటూ, ఆగస్టు ౧౪ నుంచి అక్టోబరు మొదటి వారం దాక దాదాపు ౭౦ (డెభై రోజులు) ఒక్క పైసా కాని, ఒక్క డాలరు గాని ప్రతిఫలం ఆశించకుండా ఒక్క తోటి తెలుగు బ్లాగరుకి, మరొక తెలుగు బ్లాగరు కాకపొతే మరెవ్వరు సహాయం చెయ్యగలరు? 

ఇక ఈ క్షణం వరకు ఈ తెలుగు'వాడి' గురించి ఇంకా ఏ వివరం (a/s/l/add  లాంటివి) తెలియదు. తెలుసుకోవలసిన అవసరం అంతకంటే లేదన్నది ఈ నెటిజన్ నమ్మకం. సరే, ఇక నెటిజన్ గురించి ఆ బ్లాగరికెంత తెలుసో, ఆ బ్లాగరికే తెలియాలి.  అక్టోబర్ ౯, ౨౦౦౮ న ఆఖరుసారిగా ఆ బ్లాగరిని పలకరించినది.

"మిత్రమా ఎక్కడున్నా సుఖంగా ఉండు!"

* చిరుచరి చిరంజీవి అభిమాని-కి ఆ వ్యక్తి ఇచ్చిన కితాబు.
హామీ పత్రం: ఈ మూసలోని లోపాలకు పూర్తి బాధ్యత నెటిజన్‌దే!  తెలుగు'వాడి' కి ఏ మాత్రం సంబంధం లేదు.  ఔను. ఇంకా చిన్న చిన్న కోరికలు (అమరికలు) పూర్తి చెయ్యవలసినవి ఉన్నవి.

2 వ్యాఖ్యలు:

జ్యోతి on November 2, 2008 at 10:03 PM   said...

ఆ మూస చూసినప్పుడే అనుకున్నా.తెలుగు’వాడి’ని గారి చలవే అని. అందరూ కలిసి నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు గాని. నా బ్లాగులన్నింటిలో ఆయన హస్తం కూడా ఉంది. ఒక్కో బ్లాగు డిజైన్ కీ ఒక్కో విధానం ఉండింది. నాకు కూడా ఓపికగా చెప్పేవారు.. అవును చాలా రోజులనుండి కనపడటం లేదు. ప్రకటన ఇద్దామేంటి??

cbrao on November 2, 2008 at 10:53 PM   said...

తెలుగువాడిని, అబ్రకదబ్ర, కిరణ్ వాకా, మాగంటి వంశీ, కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారు ఇంకా ఎంతో మంది పాఠకులు ఈ సిలికాన్ వాలీ లోని శాన్ హోసే చుట్టు పక్కలే ఉన్నారు. కలవాలి వీరందరినీ వీలు చూసుకుని. నెటిజన్, మీరెక్కడున్నారో తెలియపరుస్తూ నాకు ఒక వ్యక్తిగత వేగు పంపగలరా?
-cbrao,
San Jose,CA.

Post a Comment